బీడీ కార్మికులకు కరోనా దెబ్బ..7 లక్షల మందికి పని పోయింది

బీడీ కార్మికులకు కరోనా దెబ్బ..7 లక్షల మందికి పని పోయింది

నిర్మల్ టౌన్, వెలుగుఉత్తర తెలంగాణ జిల్లాల్లో 7 లక్షల మందికిపైగా మహిళలకు ఉపాధి చూపుతున్న బీడీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. కరోనా లాక్​డౌన్​ కారణంగా నెల కిందే  బీడీ  కంపెనీలన్నీ మూతపడ్డాయి. దీంతో ఈ పరిశ్రమపై ఆధారపడ్డ కుటుంబాలన్నీ భారంగా బతుకు బండి లాగుతున్నాయి. అసలే కొంతకాలంగా యాజమాన్యాల వైఖరితో బీడీ పరిశ్రమ తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నది. కరోనా లాక్​డౌన్​తో పరిస్థితి మరింత దిగజారింది.  ఇన్నాళ్లూ నెలకు మూడు, నాలుగు వేలు సంపాదిస్తూ లక్షలాది మంది మహిళలు కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. కరోనా కారణంగా కుటుంబ పెద్దలతో పాటు మహిళలు కూడా ఉపాధి కోల్పోయారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్  లాంటి రాష్ట్రాలకు చెందిన బీడీ పరిశ్రమలు  తెలంగాణ జిల్లాల్లో వేలాది బ్రాంచీలను కొనసాగిస్తున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి బీడీ పరిశ్రమ ఇక్కడి జనాలతో మమేకమైపోయింది. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోనే దాదాపు లక్షన్నర మందికి పైగా బీడీ పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్నారు. బీడీ కార్మికులతో బాటు బీడీ ప్యాకర్లు, కమిషన్ ఏజెంట్లు, బట్టి వర్కర్లు ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు. అయితే కొంతకాలంగా యాజమాన్యాల వైఖరితో బీడీ పరిశ్రమ కష్టాలను ఎదుర్కొంటోంది.

బీడీ కార్మికులకు సక్రమంగా పని చూపకపోవడం, వారికి తక్కువ వేతనాలు చెల్లించడం, పీఎఫ్, గ్రాట్యూటీ, కరువు భత్యం, హెల్త్​ ఫెసిలిటీ కల్పించడం లాంటి సదుపాయాలపై యాజమాన్యాలు దాటవేస్తూ వస్తున్నాయి.  ప్రతి నెలా కేవలం 10 రోజుల పాటే కంపెనీలను తెరిచి ఉపాధికి గండి కొడుతున్నాయనే ఆరోపణలున్నాయి.  ఇప్పటికే  తెలంగాణ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో బీడీ యాజమాన్యాలు చాలా బ్రాంచీలను ఆర్థికపరమైన నష్టాలు, నిర్వహణ భారంతో పాటు సంక్షోభ పరిస్థితుల పేరిట ఎత్తివేశాయి. ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న దాదాపు ఏడు లక్షలమంది కార్మికులు ప్రస్తుతం ఎలాంటి ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . ప్రస్తుతం ప్రభుత్వం ఒక్కొక్కరికి పన్నెండు కిలోల బియ్యంతో పాటు ప్రతి కుటుంబానికి రూ. 1500 అందిస్తున్నప్పటికీ అవి వారిని  ఆదుకునేందుకు సరిపోవడం లేదంటున్నారు. యాజమాన్యాలు కరోనా వైరస్ బూచి చూపి భవిష్యత్ లో కంపెనీలను శాశ్వతంగా మూసివేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి బీడీ కార్మికులకు, పరిశ్రమకు ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు.

బతుకులు ఆగమవుతయ్​

పదిహేను ఏళ్ల వయస్సు నుంచి బీడీలు చుడుతున్నా. నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు. దాదాపు నలభై ఏళ్ల నుంచి ఈ బీడీలను నమ్ముకుని బతుకుతున్నా. నా తల్లిదండ్రులు, అత్తమామలు, నా భర్త కూడా బీడీలు చుట్టే బతికారు. బీడీ పరిశ్రమ మూతపడితే మా బతుకులు ఆగమవుతయ్. బీడీ పరిశ్రమను సర్కారు ఆదుకోవాలి.

– మాడ కమల, బంగల్పేట్, నిర్మల్

బీడీ కార్మికులను ఆదుకోవాలి

రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి బతుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలోనే లక్షన్నర మందికి పైగా ఉన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా లక్ష మంది ఉపాధి కోల్పోయారు. యాజమాన్యాలు వీరిని ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. కేవలం ప్రభుత్వం అందించే బియ్యం, నగదుపైనే వీరు ఆధారపడ్డారు. కష్ట సమయంలో బీడీ యాజమాన్యాలు కార్మికులందరికీ చేయూతనివ్వాలి.

– కట్ల  రాజన్న, ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి