ఉద్యోగుల రూ.1,500 కోట్లు పక్కదారి

ఉద్యోగుల రూ.1,500 కోట్లు పక్కదారి

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్​లో పెడుతున్నది. ఏడాది నుంచి వీటి కోసం ఎంప్లాయీస్​ ఎదురుచూస్తున్నారు. జీపీఎఫ్, తెలంగాణ స్టేట్‌‌‌‌ గవర్నర్‌‌‌‌మెంట్‌‌‌‌ లైఫ్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ (టీఎస్ జీఎల్‌‌‌‌ఐ), మెడికల్ రీయింబర్స్​మెంట్, కమ్యూటెడ్ పెన్షన్ కింద తాము జమ చేసుకున్న పైసల్ని ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పైసలపై పూర్తి హక్కు తమకే ఉందని అంటున్నారు. నిధుల లోటు కారణంగా ఉద్యోగులకు పే చేయాల్సిన రూ.1,500 కోట్లు ప్రభుత్వం పక్కదారి పట్టించిందనే ఆరోపణలు వస్తున్నాయి. డబ్బుల కోసం అప్లికేషన్ పెట్టుకుని ఏడాదవుతున్నా.. రిలీజ్ చేయడం లేదు. ట్రెజరీ ఆఫీసుల నుంచి టోకెన్లు జనరేట్ చేయడం తప్ప ‘ఈ కుబేర్’ నుంచి డబ్బు మాత్రం ఉద్యోగుల అకౌంట్లలో పడటం లేదు. మరికొందరి ఉద్యోగుల రిటైర్మెంట్​ బెనిఫిట్స్ బిల్లులు కొన్నేండ్లుగా మూలుగుతూనే ఉన్నాయి. 

ఉద్యోగులకు జీతాలే ఇస్తున్నరు..

పీఆర్సీకి సంబంధించిన అనుబంధ జీవోలు కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా ఇవ్వలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. టీఏ, డీఏ, రిస్క్ అలవెన్స్​లు పాతవే అమలవుతున్నాయని, పీఆర్సీ ప్రకారం కొత్తవి ఇవ్వడం లేదని అంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకూ తిప్పలు తప్పడం లేవు. కమ్యూటెడ్ పెన్షన్ కింద తమ నెలవారీ పెన్షన్‌‌‌‌లో 40 శాతాన్ని ప్రభుత్వానికి సరెండర్‌‌‌‌ చేస్తామంటూ ఒప్పందం చేసుకుంటారు. ఇందుకు గాను రిటైర్డ్‌‌‌‌ ఉద్యోగులకు ప్రభుత్వం కొంత అడ్వాన్స్ చెల్లించాలి. ఈ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. గ్రాట్యుటీ కూడా ఇన్​టైంలో అందడం లేదు. ఉద్యోగులకు జీతాలివ్వడం మినహా ఇతర బిల్లులేమీ చెల్లించడం లేదని వాపోతున్నారు.

ఇన్సూరెన్స్ డబ్బులదీ అదే పరిస్థితి

టీఎస్ జీఎల్‌‌‌‌ఐ కింద ఇవ్వాల్సిన బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇందులోనూ వందల కోట్ల రూపాయలు పెండింగ్​లో ఉన్నాయి. ఈ బీమా డబ్బుల నుంచి లోన్లు తీసుకుం దామనుకుంటే బిల్లులు ఫైనాన్స్​లోనే ఉంటున్నాయే తప్ప.. క్లియర్ కావడం లేదని ఉద్యో గులు అంటున్నారు. ఉద్యోగుల సాలరీల నుంచి ప్రతినెలా కట్ చేసుకుని ఈ సొమ్ము జమ చేస్తారు. అయితే, దీనికి అప్లై చేసుకున్నా.. నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. నిబంధనల ప్రకారం.. రిటైర్డ్​ అయిన ఎంప్లాయ్​కి వెంటనే ఫుల్​ జీఎల్​ఐ డబ్బులు చెల్లించాలి. ఇప్పుడు పదవీ విరమణ వయస్సు పెరిగినప్పటికీ.. 58 ఏండ్లు నిండినవారికి జీఎల్‌‌‌‌ఐ మెచ్యూ రిటీ తప్పక క్లియర్ చేయాలనే నిబంధన ఉంది. అయితే, ఈ బిల్లులు కూడా పెండింగ్​లోనే పెడుతున్నారు. మెడికల్ రీయింబర్స్​మెంట్​ అప్లికేషన్లు వేల సంఖ్యలో ఉన్నాయి.

జీపీఎఫ్ మనీ రిలీజ్​ చేయట్లే..

భవిష్యత్‌‌‌‌ అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్‌‌‌‌ డబ్బులదీ అదే పరిస్థితి. ఈ పైసలు కూడా రిలీజ్ చేయడం లేదు. గడిచిన ఏడెనిమిది నెలల్లో ఒక్కరికి కూడా డబ్బులివ్వలేదు. ఉద్యోగులు, టీచర్ల జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తం భవిష్య నిధి (పీఎఫ్‌‌‌‌)కి జమ అవుతుంది. తన సర్వీసులో ఎప్పుడైనా అత్యవసరమైతే అందులోంచి కొంత డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న పైసలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని పార్ట్ ఫైనల్​ అంటారు. లోనుగా తీసుకుని ప్రతి నెలా చెల్లించే అవకాశం కూడా ఉంటుంది. హయ్యర్​ ఎడ్యుకేషన్​ కోసం 3నెలల బేసిక్ సాలరీ, ప్రత్యేక పరిస్థితులైతే 10 నెలల బేసిక్ సాలరీని లోను కింద తీసుకోవచ్చు. ట్రీట్​మెంట్​, కూతురి పెండ్లి కోసమైతే 6నెలల బేసిక్​ సాలరీ, కొడుకు పెండ్లికి 3నెలల బేసిక్​ సాలరీ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కూడా సర్కార్ రిలీజ్​ చేయడం లేదు.