మూడో విడత సంగ్రామ యాత్ర యాదగిరిగుట్టలో ప్రారంభం

మూడో విడత సంగ్రామ యాత్ర యాదగిరిగుట్టలో ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అయితే వచ్చే నెల 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉన్నందున ఆ ఒక్క రోజు యాత్రకు బ్రేక్ ఇవ్వాలని శుక్రవారం పార్టీ స్టేట్ ఆఫీసులో జరిగిన యాత్రపై సమీక్షలో నేతలు నిర్ణయించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఇన్​చార్జీ తరుణ్ చుగ్ జూమ్ ద్వారా పాల్గొన్నారు. యాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డితో పాటు పార్టీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్ రావు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తో పాటు యాత్ర సాగనున్న నల్గొండ, వరంగల్ జిల్లాల పార్టీ ముఖ్యులు హాజరయ్యారు. యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర వరంగల్ భద్రకాళీ గుడి వరకు కొనసాగనుంది. యాత్ర మొదలయ్యే రోజున బహిరంగ సభ నిర్వహించాలని, దీనికి జాతీయ స్థాయి కీలక నేతను ఆహ్వానించాలని నిర్ణయించారు. పాదయాత్ర రూట్ మ్యాప్, ఎన్ని రోజులు ఈ యాత్ర కొనసాగించాలి, ఏయే అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయాలనే దానిపై రాత్రి వరకు సమావేశం కొనసాగింది. వీటి విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

కేసీఆర్‌ అన్ని వర్గాలను వంచించిండు : తరుణ్​ చుగ్

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను వంచించిండని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్‌చుగ్‌  అన్నారు. ‘‘కేసీఆర్‌..  దళితులను, గిరిజనులను, మహిళలను, నిరుద్యోగులను  మోసం చేశారు. అత్యున్నత పదవి దళితులకు, గిరిజనులకు ఇచ్చి అట్టడుగు వర్గాలకు బీజేపీ రాజకీయంగా, సామాజికంగా అండగా ఉంటుందని చాటి చెప్పింది. యాత్ర జరిగే నియోజకవర్గాల ప్రజలే కాకుండా పక్క నియోజకవర్గాల ప్రజలను,  కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలి. కేసీఆర్‌ వ్యతిరేక విధానాలను, కుటుంబ పాలను ఎక్కడికక్కడ నిలదీయాలి. గ్రామ స్థాయిలో పార్టీలో చేరికలను ప్రోత్సహించండి” అని
 సూచించారు.