బీజేపీ ఓటు బ్యాంకు క్రమంగా పెరుగుతోంది

బీజేపీ ఓటు బ్యాంకు క్రమంగా పెరుగుతోంది

అధికారంలోకి రావాలంటే ఎస్సీ సీట్ల గెలుపే కీలకం
 

హైదరాబాద్​, వెలుగు: ‘మిషన్- 19’ పేరిట రాష్ట్రంలోని 19 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ‘ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ’ని ఏర్పాటు చేశామని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ అన్నారు. ఆయా స్థానాల్లో పార్టీని గెలిపించే  బాధ్యత తీసుకోవాలని నేతలకు సూచించారు. అధికారంలోకి రావాలంటే ఎస్సీ సీట్ల గెలుపే కీలకమన్నారు. సోమవారం లక్డీకపూల్ లోని ఓ హోటల్ లో  బీజేపీ ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ జితేందర్ రెడ్డి, సభ్యులు ఒంటేరు జైపాల్, సీహెచ్  విఠల్, కాంచన కృష్ణ తోపాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, కోశాధికారి శాంతికుమార్, కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాశ్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్​ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ ఓటు బ్యాంకు క్రమంగా పెరుగుతున్నదన్నారు. అంబేద్కర్ జయంతి రోజు (ఏప్రిల్ 14) నుంచి 19 ఎస్సీ నియోజకవర్గాల్లో కనీసం 2 నెలలపాటు ‘బహుజన పాదయాత్ర’ నిర్వహించేలా  ప్రణాళిక రూపొందించాలని  సూచించారు. లోక్​సభ  ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం చూస్తే.. బీజేపీ ఓటు బ్యాంకు మరింత పెరిగిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో కమిటీ ఒకరోజు పూర్తిగా పర్యటించాలని, నాయకులు, కార్యకర్తలతో సమావేశమై, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక రూపొందించాలని  సూచించారు.  నియోజకవర్గ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల లిస్ట్ ను తయారు చేయాలని,  సీఎం, జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ అభివృద్ధి  కోసం గతంలో ఇచ్చిన హామీలను గుర్తించి, వాటిపై రాబోయే 3 నెలల పాటు చేపట్టాల్సిన ఆందోళనలపై యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలన్నారు.

ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: జితేందర్ రెడ్డి
రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని, కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చని  ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల  బీజేపీ సమన్వయ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు చేతకాక ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోందని చెప్పారు. ఎన్నికలు 2023 లో జరిగినా, ముందస్తుకు వెళ్లినా అధికారంలోకి వచ్చేది బీజేపీ నే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కువ మోసపోయింది  దళితులేనని, దళితుడిని సీఎం చేస్తా అని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. 19 ఎస్సీ రిజర్వ్ డ్ సీట్లలో పర్యటించి, ప్రజలు, దళితుల సమస్యలు తెలుసుకుంటామన్నారు. ‘మిషన్ 19’ ద్వారా అన్ని ఎస్సీ సీట్లను గెలుచుకుంటామని చెప్పారు.