ఇయ్యాల హైదరాబాద్​లో బీజేపీ వరి దీక్ష

ఇయ్యాల హైదరాబాద్​లో బీజేపీ వరి దీక్ష


హైదరాబాద్, వెలుగు: ‘‘వడ్లు కొను లేదా గద్దె దిగు’’ నినాదంతో బీజేపీ సోమవారం హైదరాబాద్​లోని ఇందిరా పార్క్ దగ్గర  దీక్ష చేపట్టనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ దీక్షలో కేంద్ర మంత్రి మురళీధరన్ పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం సేకరణకు కేంద్రం సిద్ధంగా ఉన్నా.. రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్ ఎస్  నేతలు ఆందోళనల పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయకపోవడంతో రైతులను దళారులు లూటీ చేస్తున్నారన్నారు. వ్యాపారులు కనీస మద్దతు ధర రూ. 1,960 చెల్లించడం లేదని, తక్కువ ధరకు రైతులు వడ్లను అమ్ముకొని నష్టపోతున్నారని, దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే దీక్ష కోసం అనుమతి కోరుతూ పోలీసులకు బీజేపీ నేతలు అప్లయ్​ చేశారు. దీక్షలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర పదాధికారులు, జాతీయ నాయకులు,  పార్టీ ఎమ్మెల్యేలు,  ఎంపీలు, మాజీ ఎంపీలు, నేతలు పాల్గొననున్నారు.