టీ20 లీగ్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు

టీ20 లీగ్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు

టీ20 లీగ్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీ) నిర్ణయం తీసుకుంది. ముంబై, పుణె వేదికగా జరుగుతున్న లీగ్ మ్యాచ్ లు ముగిశాక.. అసలైన సమరం మొదలుకానుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ మే 24న, ఎలిమినేటర్ మ్యాచ్ మే 25న, రెండో క్వాలిఫయర్ మ్యాచ్ మే 27న, ఫైనల్ మ్యాచ్ 29న జరగనుంది. 

ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ లో ఎలిమినేటర్ మ్యాచ్ మే 26న జరగాల్సి ఉంది. దానికి ఒక రోజు ముందుకు మారుస్తూ బీసీసీఐ రీ షెడ్యూల్ చేసింది. మే 22 వరకు లీగ్ దశ మ్యాచులు జరగనున్నాయి. మొదటి క్వాలిఫయర్ తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్ లకు కోల్ కతా వేదికగా నిలవనుంది. రెండో క్వాలిఫయర్ తో పాటు ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని అతిపెద్ద స్టేడియంలో జరగనున్నాయి. ప్లే ఆఫ్స్ సహా ఫైనల్ కు 100శాతం ప్రేక్షకులను అనుమతి ఇస్తామని బీసీసీఐ తెలిపింది.

మరోవైపు మహిళల టీ20 ఛాలెంజ్ వేదికలనూ బీసీసీఐ మార్పు చేసింది. గతంలో లఖ్ నవూ స్టేడియంలో నిర్వహిద్దామని భావించినా ఆ మ్యాచ్ లను పుణె వేదికగా నిర్వహించనున్నట్లు తెలిపింది. మే 23 నుంచి మే 26వ తేదీ వరకు లీగ్ మ్యాచ్ లు.. 28న ఫైనల్ మ్యాచ్ ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది.