తెలంగాణ బోట్లు సంగమేశ్వరానికి రావద్దు

తెలంగాణ బోట్లు సంగమేశ్వరానికి రావద్దు

కృష్ణా నదిలో సరిహద్దుల పంచాయితీ 
బోటు గుంజుకుపోయిన సీమ నిర్వాహకులు

సోమశిల(నాగర్​కర్నూల్), వెలుగు : కృష్ణా నదిలో హద్దుల పంచాయితీ తెలంగాణ, రాయలసీమ మర బోట్ల నిర్వాహకుల మధ్య వివాదానికి దారితీసింది. ఏపీలోని సీమ పరిధిలోకి వచ్చే కృష్ణానదిలో ప్రఖ్యాత సప్త నదుల సంగమ క్షేత్రం ఉంది. తెలంగాణలోని సోమశిల శ్రీలలితాంబిక సోమేశ్వరాలయానికి వచ్చే భక్తులు, సందర్శకులు సంగమేశ్వర ఆలయానికి వెళ్తుంటారు. సంగమేశ్వరం వైపు బోట్లు నడుపుకుంటూ అక్కడి నిర్వాహకులకు తెలంగాణ బోట్ల నిర్వాహకులు డబ్బు చెల్లిస్తున్నారు. అయితే సోమశిల నుంచి మరబోట్లలో సంగమేశ్వరాలయానికి సందర్శకులను తీసుకురావద్దంటూ సీమ ప్రాంత బోట్ల నిర్వాహకులు హెచ్చరించారు. ఈ వివాదం ముదిరి ఆదివారం సోమశిల బోటును సీమలోని సిద్ధేశ్వరం వైపు గుంజుకుపోయారు.

నది మధ్యలో గొడవ పడి సీమ వైపు లాక్కుపోయారు. నాగర్ కర్నూల్​జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలోని కృష్ణానది తీరంలో ఈ ఘటన జరిగింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. 40 ఏండ్లుగా సోమశిల గ్రామానికి చెందిన దాదాపు 200 కుటుంబాలు కృష్ణా నదికి ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలను అటు, ఇటు చేరవేస్తున్నాయి. ఇటీవల సోమశిలకు పర్యాటకులు, భక్తుల సంఖ్య పెరిగింది. ఇక్కడి నుంచి సంగమేశ్వర దేవాలయానికి వెళ్లేవారు కూడా పెరిగారు. ఈ నేపథ్యంలోనే సోమశిల బోట్లు ఇటు రావద్దంటూ సీమ నిర్వాహకులు అడ్డుకున్నారు. దీంతో సోమశిల బోటు నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. అయితే కృష్ణానదిలో బోట్లు ఆపరేట్ చేసేందుకు రెండు రాష్ట్రాల ఫారెస్ట్, ఇరిగేషన్​ఆఫీసర్ల పర్మిషన్లు, బోట్​లైసెన్సులు కంపల్సరీ అయినప్పటికీ అవేం పట్టించుకోవడం లేదు. ఎలాంటి భద్రతా చర్యలు, లైఫ్​జాకెట్లు లేకుండానే సందర్శకులను, వెహికల్స్ ను చిన్న చిన్న మరబోట్లలో తరలిస్తున్నారు.