ప్రజల పైసలు కొట్టేసిన పోస్ట్​మాస్టర్

ప్రజల పైసలు కొట్టేసిన పోస్ట్​మాస్టర్
  • రూ. 10 లక్షల వరకు సొంతానికి వాడుకున్నడు

సిద్దిపేట, వెలుగు: గ్రామ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వందలాది మంది ఖాతాదారుల డబ్బులను బ్రాంచ్​పోస్ట్​మాస్టర్​సొంతానికి వాడుకున్నాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఆరేండ్ల క్రితం అనంతసాగర్ గ్రామ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా బాధ్యతలు చేపట్టాడు. గ్రామంలో సుకన్య సమృద్ధి యోజన కింద 55 మంది, సేవింగ్ ఖాతాలో 71 మంది, రికరింగ్ డిపాజిట్ లో 415 మంది, గ్రామీణ తపాలా జీవిత బీమాకు 50 మంది చొప్పున నెలవారీగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కు డబ్బులు ఇస్తున్నారు. వీరంతా వ్యవసాయ కూలీలు, రైతులు కావడంతో వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న శ్రీకాంత్​వారి డబ్బును ఆన్​లైన్​లో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నాడు. ప్రజల ఖాతా బుక్ లో మాత్రం నగదు జమ చేసినట్లు రాసేవాడు. ఇటీవల కొందరు ఖాతాదారులు గ్రామంలోని సిద్దిపేట పోస్ట్ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడ తమ ఖాతా వివరాలు చూపాలని సిబ్బందిని అడగగా మూడేండ్లుగా డబ్బులు జమ కావడం లేదని చెప్పారు. దీంతో వారంతా గ్రామానికి వచ్చి పోస్ట్ మాస్టర్ ను నిలదీశారు. విషయం తెలుసుకున్న పోస్టల్ అధికారులు శ్రీకాంత్ ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై సిద్దిపేట పోస్టాఫీస్​అసిస్టెంట్ సూపరింటెండెంట్ నర్సింహను వివరణ కోరగా డబ్బులను ఆన్​లైన్​లో జమ చేయని మాట వాస్తవమేనని చెప్పారు. అతని నుంచి రూ. లక్ష వరకు రికవరీ చేశామని, మొత్తం ఖాతా బుక్కులను పరిశీలించి అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. దాదాపు పది లక్షల వరకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సొంతానికి వాడుకున్నట్లు తెలుస్తోంది.