V6 News

బిల్ట్ మిల్లు తిరిగి తెరిపించాలి .. ఫిన్​క్వెస్ట్, ఐటీసీ ప్రతినిధులతో రేవంత్

బిల్ట్ మిల్లు తిరిగి తెరిపించాలి ..  ఫిన్​క్వెస్ట్, ఐటీసీ ప్రతినిధులతో రేవంత్

హైదరాబాద్, వెలుగు: ములుగు జిల్లా కమలాపురంలోని బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బీఎల్ఐటీ) మిల్లు తిరిగి తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీని కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని వెల్లడించారు. నేషనల్ కంపెనీ లా ట్రిబున్యల్ తీర్పు ప్రకారం.. ప్రస్తుతం బిల్ట్ కంపెనీ ఆస్తులు ఫిన్‌‌‌‌‌‌‌‌క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధీనంలో ఉన్నాయి.

ఆ కంపెనీ ఎండీ హార్దిక్ పటేల్‌‌‌‌‌‌‌‌, ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సీఈవో వాదిరాజ్ కులకర్ణితో పాటు సంబంధిత అధికారులతో రేవంత్ సెక్రటేరియట్​లో సోమవారం సమావేశమయ్యారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనే ఆలోచనను వారితో పంచుకున్నారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, సాధ్యాసాధ్యాలను చర్చించారు. మిల్లును తెరిపించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఫిన్‌‌‌‌‌‌‌‌క్వెస్ట్ బృందాన్ని కోరారు. బిల్డ్ ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఐటీసీ కంపెనీ ఆసక్తి చూపుతున్నది. ఐటీసీతో చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని ఫిన్ క్వెస్ట్ బృందాన్ని సీఎం కోరారు. బిల్ట్ మిల్లును పునరుద్ధరించే ప్రక్రియలో ఐటీసీకి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఐటీసీ చేపట్టిన ప్రాజెక్టులు, భవిష్యత్తు ప్రణాళికలపై కూడా ఈ భేటీలో చర్చించారు. 

మిల్లులో కలప గుజ్జు తయారీ

బిల్ట్ మిల్లులో బట్టల తయారీకి ఉపయోగించే కలప గుజ్జు తయారు చేస్తారు. 2014లో ఈ మిల్లు మూతపడింది. దీంతో దాదాపు 750 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వీరందరికీ ఉపాధి కల్పించడంతో పాటు స్థానికంగా ఉద్యోగ కల్పనకు వీలుగా ఈ మిల్లును తిరిగి తెరిపించేందుకు రేవంత్ చొరవ చూపుతున్నారు. ఈ రివ్యూలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంవో అధికారులు, ములుగు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015, 2018లో ప్రోత్సాహకాలను పొడిగించి, మూతపడ్డ ఈ యూనిట్‌‌‌‌‌‌‌‌ను పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించ లేవు.

రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తం: సీఎంతో హెచ్​సీసీబీ కంపెనీ ప్రతినిధి బృందం

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు హిందుస్థాన్ కోకో కోలా బెవెరేజెస్ (హెచ్​సీసీబీ) కంపెనీ ముందుకొచ్చింది. కంపెనీ ప్రతినిధి బృందం సోమవారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలో ఇప్పటి దాకా ఈ కంపెనీ దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. సిద్ధిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్​లో ఈ కంపెనీ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులతో పాటు సామాజిక అభివృద్ధిలో తమ కంపెనీ భాగస్వామ్యమవుతుందని కంపెనీ ప్రతినిధి బృందం సీఎంతో చర్చలు జరిపింది. కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానం అమల్లో ఉంటుందని సీఎం వారికి భరోసా ఇచ్చారు. ఈ భేటీలో హెచ్​సీసీబీ పబ్లిక్ అఫైర్స్ చీఫ్ హిమాన్షు ప్రియదర్శిని, కంపెనీ ప్రతినిధులు ఉన్నారు.