
బస్సు డ్రైవర్ అపస్మారక స్థితిలోకి చేరడాన్ని గమనించిన ఓ బాలుడు చాకచక్యాన్ని ప్రదర్శించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిచిగాన్లోని వారెన్ కన్సాలిడేటెడ్ స్కూల్ కి చెందిన బస్సు నడుపుతున్నప్పుడు డ్రైవర్ అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అది గమనించిన 7 వ తరగతి విద్యార్థి డిల్లాన్ రీవ్స్ అప్రమత్తమయి, బస్సు అదుపు తప్పకుండా స్టీరింగ్ ని పట్టుకున్నాడు. అనంతరం మసోనిక్ బౌలేవార్డ్లో బస్సును సురక్షితంగా ఆపాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో బస్సులో దాదాపు 66 మంది విద్యార్థులు ఉన్నారు. బాలుడి తెగువకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.