కోకాపేటలో బీఆర్ఎస్​కు 11 ఎకరాలు.. రూ.550 కోట్ల జాగా రూ.37 కోట్లకే

కోకాపేటలో బీఆర్ఎస్​కు 11 ఎకరాలు.. రూ.550 కోట్ల జాగా రూ.37 కోట్లకే

కోకాపేటలో బీఆర్ఎస్​కు 11 ఎకరాలు
రూ.550 కోట్ల జాగా రూ.37 కోట్లకే
కేబినెట్ నిర్ణయం తెల్లారే సీక్రెట్​గా సర్క్యులర్ 
‘2008లో కాంగ్రెస్​కు ఇచ్చినట్టే బీఆర్ఎస్​కు ఇస్తున్నం’ అని పేర్కొన్న ప్రభుత్వం 
అత్యంత రహస్యంగా కదిలిన ఫైల్.. వారంలోనే క్లియర్  

హైదరాబాద్, వెలుగు : పేదలకు డబుల్​ బెడ్రూమ్ ఇండ్లు కట్టేందుకు, దళితులకు మూడెకరాలు ఇచ్చేందుకు స్థలం దొరుకుతలేదంటున్న సర్కార్.. హైదరాబాద్​లో అత్యంత ఖరీదైన భూమిని తమ పార్టీకి అప్పనంగా రాసిచ్చింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో 11 ఎకరాలను బీఆర్ఎస్​కు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.550 కోట్ల విలువైన స్థలాన్ని.. కేవలం రూ.37.53 కోట్లకే ముట్టజెప్పేందుకు అంగీకారం తెలిపింది. కొత్త సెక్రటేరియెట్​లో గురువారం జరిగిన కేబినెట్​ మీటింగ్​లో అత్యంత రహస్యంగా ఈ ఫైల్ మూవ్ అయింది.

కేబినెట్​లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు కూడా బీఆర్ఎస్​కు 11 ఎకరాల భూమిని కేటాయించిన విషయం మాట మాత్రమైనా ప్రస్తావించలేదు. దీనిపై శుక్రవారం సర్క్యులర్ జారీ అయినప్పటికీ, అది కూడా బయటకు రాలేదు. అధికార పార్టీ వ్యవహారం కావడంతో ఫైల్ పంపించడం, ఆమోదం తెలపడం, సర్క్యులర్ జారీ కావడం.. అంతా సీక్రెట్ గా జరిగిపోయినట్లు తెలుస్తున్నది. వందల కోట్ల విలువైన భూమిని కేవలం రూ.37.53 కోట్లకే సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ చక్రం తిప్పిన తీరు భారీ భూదందాకు తెరలేపినట్లయింది. 

అంతా సీక్రెట్​గా.. స్పీడ్​గా...  

బీఆర్ఎస్ నుంచి దరఖాస్తు అందిన వారం రోజుల్లోనే ఫైల్​ను ప్రభుత్వం క్లియర్​చేసింది. భూమి కోసం ఈ నెల 12న ప్రభుత్వానికి బీఆర్ఎస్ దరఖాస్తు చేసుకుంది. ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, విద్యావేత్తలకు శిక్షణ, పర్సనాలిటీ డెవలప్​మెంట్​కోసం ఇనిస్టిట్యూట్​ఫర్​ఎక్సలెన్స్​అండ్​హ్యూమన్ ​రీసోర్స్ ​డెవలప్​మెంట్​ఏర్పాటు చేస్తామని అందులో పేర్కొంది. దీనికోసం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లలో భూమి కేటాయించాలని కలెక్టర్ ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్.. కోకాపేటలో 239, 240 సర్వే నంబర్లలోని 11 ఎకరాల జాగను హెచ్​ఎండీఏ ద్వారా ఇప్పించాలని ఈ నెల 16న సీసీఎల్​ఏకు ప్రతిపాదనలు పంపించారు. అంతేకాదు.. ఆ సర్వే నంబర్లలో ప్రస్తుతం ఎకరా ధర మార్కెట్​రేటు ప్రకారం రూ.3 కోట్ల 41 లక్షల 25 వేలు ఉందని.. 11 ఎకరాలకు రూ.37 కోట్ల 53 లక్షల 75 వేలు అవుతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు వచ్చిన మర్నాడే (ఈ నెల 17న) సీసీఎల్ఏ ఆ ఫైల్ ను తెలంగాణ స్టేట్​ల్యాండ్​మేనేజ్​మెంట్ అథారిటీకి (టీఎస్​ఎల్ఎంఏ) పంపించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే బీఆర్ఎస్​కు భూమిని అప్పగించాలంటూ టీఎస్ఎల్ఎంఏ కూడా వెంటనే సిఫార్సు చేసింది. టీఎస్​ఎల్ఎంఏ ప్రతిపాదనలపై గురువారం జరిగిన కేబినెట్​సమావేశంలో చర్చ జరిగింది. ఆ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్,  మంత్రులందరూ ఓకే చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తెల్లారే అంటే శుక్రవారం బీఆర్ఎస్​కు అతి తక్కువ ధరకు భూమిని కట్టబెడ్తూ సర్క్యులర్ వచ్చింది. హెచ్ఎండీఏ పరిధిలోని వందల కోట్ల విలువైన భూమిని వారంలోనే కేవలం రూ.37.53 కోట్లకే బీఆర్ఎస్​కు దక్కింది. 

డెడ్ చీప్​గా..

కోకాపేటలో ఇటీవల నిర్వహించిన వేలంలో ఒక్కో ఎకరం రూ.50 కోట్లకు అమ్ముడు పోయింది. అంటే 11 ఎకరాలకు రూ.550 కోట్లు అవుతుంది. కానీ ఇంత విలువైన భూమిని డెడ్​చీప్​గా కేవలం రూ.37.53 కోట్లకే తమ పార్టీకి ప్రభుత్వం కట్టబెట్టింది. పైగా బీఆర్ఎస్ కు భూమి ఇవ్వడాన్ని సమర్థించుకుంది. అప్పుడెప్పుడో 2008లో కాంగ్రెస్​కు​ భూమి ఇచ్చినట్టే బీఆర్ఎస్​కు ఇస్తున్నామని సర్క్యులర్​లో పేర్కొంది. ‘‘నేషనల్​లెవెల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ​హ్యూమన్ ​రీసోర్స్ డెవలప్​మెంట్​ కోసం హైదరాబాద్​లోని తిరుమలగిరి మండలం బోయిన్​పల్లిలోని 502, 503, 502/పీ2 సర్వే నంబర్లలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్​కు 10 ఎకరాల 15 గుంటలు కేటాయించారు. ఇప్పుడు బీఆర్ఎస్​కూ అదే పద్ధతిలో 11 ఎకరాలు కేటాయిస్తున్నాం” అని తెలిపింది.