అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి.. కస్టడీలో ప్రశ్నించాల్సి ఉంది : సీబీఐ

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి.. కస్టడీలో ప్రశ్నించాల్సి ఉంది : సీబీఐ

కడప వైఎస్ఆర్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఇటీవల సీబీఐ వేసిన కౌంటర్ కాపీలో కీలక విషయాలు ఉన్నాయి. అవినాష్ రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉందని పేర్కొంది. దురుదేశపూర్వకంగా అవినాష్  విచారణకు సహకరించడం లేదని, అన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటివేసి... వాస్తవాలు చెప్పడం లేదని కౌంటర్ కాపీలో సీబీఐ తెలిపింది. దర్యాప్తును తప్పుదోవ పట్టించే విధంగా అవినాష్ సమాధానాలు ఇచ్చాడని, అందుకే కస్టడీలోకి తీసుకుని విచారించాలని పేర్కొంది. దర్యాప్తును తప్పించుకునేందుకే పిటిషన్లు వేస్తున్నాడని, విచారణను పక్కదారి పట్టించేందుకే ముందస్తు బెయిల్ కోరుతున్నాడని సీబీఐ వేసిన కౌంటర్ కాపీలో ఈ విషయాలు ఉన్నాయి. 

ఆరుఅంశాలపై అవినాష్ ను ప్రశ్నించాలని సీబీఐ కోరింది. వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధం ఇంకా దొరకలేదని, హత్య కోసం జరిపిన 4 కోట్ల రూపాయల లావాదేవీల గురించి ప్రశ్నించాలని తెలిపింది. సునీల్ యాదవ్ అవినాష్ ల సంబంధాలపై వివరాలు తీసుకోవాలని, హత్య కు ముందు, తర్వాత రోజు అవినాష్ రెడ్డి ఎక్కడ ఉన్నాడనేది క్లారిటీ కావాలని పేర్కొంది. ఓబుల్ రెడ్డి, భరత్ యాదవ్ లు ఎందుకు దస్తగిరి వెంట పడ్డారో అవినాష్ ను అడిగి తెలుకోవాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. 

మరోవైపు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. వివేకా లెటర్ పై సీబీఐ అధికారులు ఆరా తీశారు. సీబీఐ విచారణకు వివేకా పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాష్ హాజరయ్యారు. ఇద్దరిని కలిపి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేకా ఇంట్లో వంట మనిషిగా లక్ష్మీదేవి కుమారుడు ప్రకాష్ పని చేస్తున్నాడు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు లెటర్ దాచి పెట్టడంపై ప్రకాష్ ను అధికారులు విచారిస్తున్నారు. మే 2వ తేదీన వివేకా పీఏ కృష్ణారెడ్డిని విచారించి... వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. పీఏ కృష్ణారెడ్డి ద్వారా లెటర్ ను దాచి పెట్టాడని ప్రకాష్ పై ఆరోపణలు ఉన్నాయి.