ఆదర్శ పల్లెలకు అండగా కేంద్రం

ఆదర్శ పల్లెలకు అండగా కేంద్రం

పీఎంఏజీవై కింద మౌలిక వసతుల కల్పన
50 శాతం ఎస్సీ జనాభా గల ఊర్లకు సాయం

మంచిర్యాల, వెలుగు: అభివృద్ధి, సంక్షేమంలో వెనుకబడిన గ్రామాలను ఆదర్శంగా తీర్చి దిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన (పీఎంఏజీవై) పథకాన్ని ప్రవేశపెట్టింది . 2011 జనాభా లెక్కల ప్రకారం 5 0 శాతానికి పైగా ఎస్సీ జనాభా గల గ్రామాలకు ప్రాధాన్యం కల్పించింది. ఈ పథకం కింద రాష్ర్టవ్యాప్తంగా 27 జిల్లాల్లో 162 గ్రామాలను ఎంపిక చేసింది. ఇప్పటివరకు135 గ్రామాలకు ఆమోదం లభించినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ లో నాలుగు, నిర్మల్, ఆసిఫాద్ జిల్లాల్లో ఆరు గ్రామాల చొప్పున ఎంపికయ్యాయి. ఇక రాష్ర్టంలోనే అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 29 గ్రామాలను సెలెక్ట్ చేయడం విశేషం.

ఎంపికైన గ్రామాలివే…

ఆదిలాబాద్ జిల్లాలో తలమద్రి, ఘట్టి, తార్నం(కె), మాలెపూర్, ఆసిఫాబాద్ జిల్లాలో పరందోలి, ముకద్దం గూడ, డోర్పల్లె, కిష్టాపూర్, చీపురుదుబ్బ, పర్శనంబాల, దేవునిగూడ, నిర్మల్ జిల్లాలో భుట్టా పూర్, నాచన్యెల్లాపూర్, కొత్తమద్దిపడగ, ఓల్డ్ పోచంపాడ్, కిర్గుల్(బి), భాగపూర్ గ్రామాలను ఎంపిక చేశారు. మంచిర్యాల జిల్లాలో పొన్నారం, దస్నాపూర్ , పోలం పల్లి, ఎల్కంటి, మల్లిడి, మన్నె గూడెం, పౌనూర్, కేస్లాపూర్, మిట్టపల్లి, వెంకంపేట్, వేవులవాడ, బబ్బె రచెల్క, కొమ్మెర, ఎర్రగుంటపల్లి, ఏదులబందం, రొయ్యలపల్లి, వెంకటాపూర్, వేలాల్, అల్గామ, జెండ వెంకటాపూర్ , తిమ్మాపూర్, గంగారం, నర్వ, అంగ్రాజ్పల్లి, ముదిగుంట, ఆరెపల్లి, గుండ్లసోమారం, కోమటిచేను, మామిడిగట్టు గ్రామాలను సెలక్ట్ చేశారు.

గ్రామానికి రూ.20లక్షల నిధులు…

పీఎంఏజీవై పథకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. ఒక్కో గ్రామానికి రూ.10 లక్షల చొప్పున రెండు విడతల్లో మొత్తం రూ.20లక్షల నిధులను విడుదల చేస్తుంది. మొదటి విడత నిధులతో చేపట్టిన పనుల ప్రగతి సంతృప్తికరంగా ఉన్నట్లయితే రెండో విడత నిధులను మంజూరు చేస్తుంది. ఈ ఫండ్స్ ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీ భవనాలు, స్కూళ్ల‌లో టాయ్ లెట్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణంతో పాటు గ్రామాల్లో తాగునీటి సౌ కర్యం కల్పిస్తారు. సర్పంచ్ చైర్మన్ గా, ఎస్సీ వార్డు మెంబర్ సభ్యుడిగా ఉండే విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ (వీడీపీ) లో ఆమోదించిన ఇతర పనులను సైతం చేపట్టవచ్చు.

పూర్తయిన విలేజ్ సర్వే…

పీఎంఏజీవై పథకం కింద ఎంపికైన గ్రామాల్లో ఇటీవల విలేజ్ లెవల్ సర్వే చేపట్టారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్పెషల్ టీం మెంబర్లు ఆయా గ్రామాలను సందర్శించి ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఎస్సీ కాలనీల్లోని సమస్యలపై ఆరా తీసి, అక్కడ చేపట్టాల్సిన పనులపై నివేదిక రూపొందించారు. అలాగే ఎస్సీల్లో సామాజిక, ఆర్థికర్థి అంతరాలను తగ్గించేందుకు ఈ పథకం కింద సమగ్ర సమాచారం సేకరించారు. గ్రామంలో మొత్తం ఎస్సీ జనాభా, అక్షరాస్యుల సంఖ్య, సాగుభూములు, సాగునీటి వసతులు తదితర వివరాలను రిపోర్టులో పొందుపర్చారు. వాస్తవానికి ఈ పథకాన్ని 2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పలు రాష్ర్టాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టింది . 2014లో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించింది. మన రాష్ర్టం లో 2018–19లో ఫస్ట్ ఫేజ్, 2019–20లో సెకండ్ ఫేజ్ లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం