
- సీఎం రేవంత్ చొరవతో2025 మార్చి 31 వరకు పొడిగించేందుకు కేంద్రం ఆమోదం
- కొనసాగుతున్న పనులకు సెప్టెంబర్ వరకు నిధులు
- ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిలో ఇస్తామన్న కేంద్రం
- కరీంనగర్, వరంగల్లో కొనసాగనున్న స్మార్ట్ వర్క్స్
కరీంనగర్, వెలుగు: స్మార్ట్ సిటీ మిషన్ గడువును 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. వాస్తవానికి ముందుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కరీంనగర్, వరంగల్ స్మార్ట్ సిటీల పనుల గడువు జూన్ 30తో ముగిసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 24న కేంద్ర హౌసింగ్, అర్బన్ అఫైర్స్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసిన సీఎం రేవంత్రెడ్డి.. స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితిని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం.. స్మార్ట్ సిటీ మిషన్ ను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ శనివారం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇప్పటికే నిధులు కేటాయించి, ఆమోదించిన పనులను కొనసాగించాలని, కొత్త పనుల మంజూరు ఉండవని ఈ లేఖలో స్పష్టం చేసింది. జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిన విడుదల చేయనున్నట్టు తెలిపింది. అందుకే వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని సూచించింది.
కరీంనగర్, వరంగల్ లో పెండింగ్ వర్క్స్..
రాష్ట్రం నుంచి 2017లో వరంగల్, కరీంనగర్ నగరాలు స్మార్ట్ సిటీ మిషన్ కింద ఎంపికైన విషయం తెలిసిందే. వరంగల్ లో ఇప్పటివరకు 45 పనులు పూర్తయ్యాయి. రూ. 518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయి. కరీంనగర్ లో 25 పనులు పూర్తయ్యాయి. రూ. 287 కోట్లతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయి. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి తెలియజేశారు.
స్మార్ట్ సిటీ నిధులను గత సర్కార్ దారి మళ్లించింది: బండి సంజయ్
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకపోవడంతోపాటు స్మార్ట్ సిటీ మిషన్ నిధులను దారి మళ్లించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులను సక్రమంగా వినియోగించి, సత్వరం పనులు పూర్తి చేసినట్లయితే కరీంనగర్, వరంగల్ పట్టణాలు ఇప్పటికే అద్దంలా మెరిసేవని తెలిపారు. తాను పార్లమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ లో నిలదీసిన తర్వాత కేంద్ర నిధులను జమ చేశారని అన్నారు. తక్షణమే స్మార్ట్ సిటీ నిధుల అవతవకలు, కమీషన్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. స్మార్ట్ సిటీ నిధులను విడుదల చేయాలని గతంలో తాను మూడుసార్లు లేఖ రాశానని తెలిపారు. కరోనాతో రెండేండ్ల కాలం వృథా కావడంతో స్మార్ట్ సిటీ మిషన్ ను పొడిగించాలని కోరినట్టు వెల్లడించారు. మార్చి నెలాఖరు వరకు స్మార్ట్ సిటీ మిషన్ ను పొడిగించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.