ముడిచమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గింపు

 ముడిచమురుపై  విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గింపు

కేంద్ర ప్రభుత్వం విండ్ ఫాల్ టాక్స్ను తగ్గించింది.  క్రూడ్ ఆయిల్,  డీజిల్, జెట్ ఇంధన  రవాణాపై విండ్‌ఫాల్ పన్ను తగ్గిస్తునట్లు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతేకాకుండా డీజిల్, విమాన ఇంధన రవాణాపై లీటర్‌కు రూ. 3  పన్ను తగ్గుతుందని ప్రకటించింది. అటు  పెట్రోలుపై లీటర్కు  రూ.6 ఎగుమతి పన్నును కూడా కేంద్రం రద్దు చేసింది. 

పెట్రోలియం రంగానికి  భారీ ఊరట..
దేశీయంగా ఉత్పత్తి చేసే ముడిచమురుపై టాక్స్ను దాదాపు 27 శాతం తగ్గించింది. దీని ప్రకారం  టన్నుకు రూ. 23,250  నుంచి రూ.17 వేలకు తగ్గింది. అంతర్జాతీయంగా చమురు రేట్లు తగ్గడంతోనే  దేశీ చమురు ఉత్పత్తి దారులు, రిఫైనర్లపై విండ్‌ఫాల్ టాక్స్ను తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. విండ్‌ఫాల్‌ టాక్స్‌ విధించిన  నెలలోపే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇక తాజాగా సవరించిన రేట్లు జూలై 20 నుంచే అమలులోకి వచ్చేశాయి. కేంద్రం ప్రకటించిన విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు, ఎగుమతులపై సుంకాల కోత  పెట్రోలియం రంగానికి  భారీ ఊరటనివ్వనుంది. అటు మొన్నటి వరకు 100 డాలర్ల కంటే తక్కువ పలికిన బ్యారెల్ ధర మళ్లీ పెరిగింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ 107.23 డాలర్లగా పలుకుతోంది.

విండ్ ఫాల్ ట్యాక్స్  అంటే ఏమిటి..?
ముడిచమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో చమురు, గ్యాస్ ఉత్పత్తిదారులు ప్రభుత్వానికి  విండ్ ఫాల్ ట్యాక్స్ చెల్లిస్తారు. ఊహించని విధంగా ముడిచమురుల ద్వారా  ఎక్కువ డబ్బులు సంపాదిస్తే ఈ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో  రష్యా--ఉక్రెయిన్ యుద్ధంతో  సరఫరాలో సమస్యల తలెత్తింది. ఈ సమయంలో  ముడిచమురు ధరలు 14  ఏండ్ల  గరిష్ట స్థాయికి చేరాయి. బ్యారెల్‌ ధర ఏకంగా 139 డాలర్లు పలికింది.  దీంతో చమురు, గ్యాస్ ఉత్పత్తిదారులు అకస్మాత్తుగా కోటీశ్వరులయ్యారు.  ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపట్టకుండానే భారీ లాభాలను ఆర్జించారు. అయితే ప్రస్తుతం ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో..వారికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది.