
ఏడేళ్ల పాటు మెయింటేన్ చేసేలా ఈఈఎస్‌ఎల్ అగ్రిమెంట్
పంచాయతీలకు తగ్గనున్న భారం
యాదాద్రి జిల్లాలో ఇప్పటికే 100 గ్రామాల్లో తీర్మానం
యాదాద్రి, వెలుగు : గ్రామాల్లో స్ట్రీట్‌లైట్ల నిర్వహణ ఇక నుంచి కేంద్రం చేతుల్లోకి వెళ్లనుంది. అన్ని ఊళ్లకు ఎల్‌ఈడీ లైట్లు సప్లై చేయడంతో పాటు, మెయింటెనెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) నిర్వహించనుంది. దీనివల్ల కరెంట్ ఆదా కావడంతో పంచాయతీల భారం తగ్గనుంది. మున్సిపాలిటీల్లో స్ర్టీట్‌లైట్ల ఏర్పాటును గతంలోనే ఆ సంస్థ తన పరిధిలోకి తీసుకోగా, ప్రస్తుతం గ్రామాల బాధ్యత సైతం చేపట్టింది.
ఏడేళ్ల పాటు నిర్వహణ
గ్రామాల్లో స్ర్టీట్ లైట్ల ఏర్పాటు, నిర్వహణ బాధ్యత చూసేందుకు ఈఈఎస్‌ఎల్ సంస్థ ఈ నెల 7న పంచాయతీ రాజ్ డిపార్ట్‌మెంట్‌తో అగ్రిమెంట్ చేసుకుంది. దీని ప్రకారం ఏడేళ్లు పాటు అన్ని ఊళ్లకు నాణ్యమైన ఎల్‌ఈడీ లైట్లను అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం అన్ని గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు చేసి పంపించాలని డీపీవోలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎల్‌ఈడీ లైట్లకు సంబంధించిన బిల్లులను పంచాయతీలు ఏడు సంవత్సరాల పాటు ఈఎంఐల రూపంలో చెల్లించవచ్చు. నేషనల్ లైటింగ్ కోడ్ ప్రకారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన లైట్లను అలాగే ఉంచి, మిగిలిన ప్రాంతాలతో పాటు, ఎక్కడైనా పాతవి ఫెయిల్ అయితే వాటి స్థానంలో కూడా కొత్త లైట్లు ఏర్పాటు చేసే బాధ్యత ఈఈఎస్‌ఎల్ సంస్థదే. ఈ లైట్లు చీకటి పడగానే ఆటోమేటిక్‌గా ఆన్ అవడంతో పాటు, తెల్లవారగానే ఆఫ్ అవుతాయి. నిర్వహణ బాధ్యతలు చూసేందుకు రెండు గ్రామాలకు కలిపి ఓ వ్యక్తిని సంస్థే నియమించనుంది.
30 శాతం ఆదా…
ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు వల్ల కరెంట్ ఆదా కావడంతో పాటు, పంచాయతీలకు బిల్లుల భారం కూడా తగ్గుతుంది. నాణ్యమైన ఎల్‌ఈడీ లైట్లను కేంద్ర ప్రభుత్వ సంస్థ తక్కువ ధరకే అందచేస్తున్నందున సుమారు 30 శాతానికి పైగా ఖర్చు సేవ్ అయ్యే చాన్స్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. పైగా డబ్బు కూడా వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు ఉన్నందున గ్రామాలపై ఒత్తిడి కూడా ఉండదని అంటున్నారు.
యాదాద్రి జిల్లాలో 2,520 మీటర్లు
యాదాద్రి జిల్లాలోని పంచాయతీల్లో మొత్తం 80 వేల స్ట్రీట్ లైట్లు ఉంటాయని అంచనా. వీటి కోసం 2,520 మీటర్లను ఏర్పాటు చేశారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణకు ఎంత కరెంట్ కాలుతుందో ఈ మీటర్ల ద్వారా పంచాయతీల నుంచి కరెంట్ డిపార్ట్ మెంట్ బిల్లులు వసూలు చేస్తోంది.
100 పంచాయతీల్లో తీర్మానం
యాదాద్రి జిల్లాలో మొత్తం 421 పంచాయతీలు ఉన్నాయి. ఈఈఎస్‌ఎల్‌తో ఒప్పందానికి అనుకూలంగా ఇప్పటికే 100 గ్రామాలు తీర్మానాలు చేశారు. అలాగే ఆయా గ్రామాల్లో ఎన్ని కరెంట్స్తంభాలు ఉన్నాయి.. ఎన్ని లైట్లు అవసరం అవుతాయనే లెక్కలు కూడా పంపించారు. అయితే కొందరు సర్పంచ్‌లు మాత్రం తీర్మానం చేయడానికి అంగీకరించడం లేదని తెలుస్తోంది. దీంతో వారికి అవగాహన కల్పించేందుకు ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
ఎల్ ఈడీ లైట్ల కొనుగోలు, మెయింటెనెన్స్ బాధ్యత కేంద్ర ప్రభుత్వం సంస్థ ఈఈఎస్ ఎల్ తీసుకునేందు కు అగ్రిమెం ట్ చేసుకుంది. ఇందుకోసం గ్రామ పంచాయతీలు తీర్మానం చేయాలి. అయితే ఇందుకు కొందరు సర్పంచ్ లు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో వారికి అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఒప్పందం వల్ల పంచాయతీలపై ఆర్థికభారం తగ్గుతుంది.-సాయిబాబ, డీపీవో