ఆ దేశం వెళ్లకండి.. భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన

ఆ దేశం వెళ్లకండి.. భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తత నెలకొంది. హిబ్బొల్లా, హమాస్ టాప్ లీడర్లను అంతమొందించడంతో ఇజ్రాయెల్‎పై ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలోనే హత్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‎పై ఇరాన్ ఎటాక్ చేసింది. దాదాపు 200 మిస్సైళ్లు, బాంబులతో ఇజ్రాయెల్‎పై విరుచుకుపడింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం అలుముకుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. 

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు  తారాస్థాయికి చేరుకోవడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పశ్చిమాసియా దేశాల్లో నివస్తోన్న భారతీయులకు.. అలాగే ఆ దేశాలకు వెళ్లాలనుకుంటున్నవారికి కీలక సూచనలు చేసింది. ఈ మేరకు భారతీయ పౌరులకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. ‘‘ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతోన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. భారతీయ పౌరులు ఇరాన్‌కు అనవసరమైన ప్రయాణాలను నివారించుకోండి. ప్రస్తుతం ఇరాన్‌లో నివసిస్తున్న ఇండియన్స్ సైతం అప్రమత్తంగా ఉండాలి. 

Also Read :- అమెరికాకు ఇరాన్ డెడ్లీ వార్నింగ్

ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించండి’ అని భారతీయులకు సూచించింది ఇండియన్ గవర్నమెంట్.  మరోవైపు ఇజ్రాయెల్‎లో ఉన్న భారతీయులను సైతం భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయంతో టచ్ లో ఉండాలని ఇండియన్స్ కు సూచించింది. అనవసరమైన ప్రయాణాలను నివారించుకోవాలని.. దాడులు జరుగుతోన్న నేపథ్యంలో భద్రతా ఆశ్రయాలకు దగ్గరగా ఉండాలని సూచన చేసింది. భారతీయుల భద్రతపై ఇజ్రాయెల్ అధికారులతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉంటున్నామని ఇండియన్ గవర్నమెంట్ వెల్లడించింది.