
హైదరాబాద్, వెలుగు: హోటల్ ఓనర్‌ను గన్, కత్తితో బెదిరించిన ఇద్దరిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారిని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ సిటీలోని హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన మహ్మద్ హుస్సేన్ అలియాస్ మోడల్ అయాన్(29) కొత్తపేటలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. తన ఫ్రెండ్ సయ్యద్ మొహీనుద్దీన్ అహ్మద్ అర్బాజ్(17)తో కలిసి ఈ నెల 18న సైఫాబాద్‌లోని ఓ హోటల్‌కి వెళ్లాడు.
అక్కడ టీ తాగగా రూ.30 బిల్ అయ్యింది. హోటల్ ఓనర్‌కు రూ.2వేల నోట్ ఇవ్వగా, చేంజ్ లేదని చెప్పడంతో ఇద్దరూ ఆయనతో వాగ్వాదానికి దిగారు. వారికి మరో వ్యక్తి తోడయ్యాడు. హుస్సేన్, మొహీనుద్దీన్ తమ వద్ద ఉన్న ఎయిర్‌గన్, కత్తి తీసి టేబుల్‌పై పెట్టి ఓనర్‌ను బెదిరించారు. దీంతో భయపడ్డ ఓనర్ వారి వద్ద డబ్బులు తీసుకోకుండానే పంపించేశాడు. అనంతరం సైఫాబాద్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. బైక్ నంబర్ ఆధారంగా హుస్సేన్, మొహీనుద్దీన్‌ను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.