ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇంటి ముందు ఎర్రగడ్డపల్లి గ్రామస్తుల ఆందోళన

ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇంటి ముందు ఎర్రగడ్డపల్లి గ్రామస్తుల ఆందోళన

తమ ఊరికి వెళ్లే రోడ్డును బాగు చేయాలంటూ వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగడ్డపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని నిలదీశారు. కొన్నేళ్లుగా సుల్తాన్ పూర్, ఎర్రగడ్డపల్లి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైందని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు కోసం ఎర్రగడ్డపల్లి గ్రామస్తులు ర్యాలీగా తన ఇంటికి రావడంపై ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఒంటికాలిపై లేశారు. రోడ్డు వేసే పని తనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు మంజూరై మూడు నెలలు దాటినా..పనులు మొదలు పెట్టలేదని గ్రామస్తులు తెలిపారు. అయితే.. ‘దానికి నేనేం చేయాలి..? వచ్చి రోడ్డు వేయాలా..?’ అంటూ జనాలపై చిందులు తొక్కారు. రోడ్డు నిర్మాణం గ్రామస్తులు ఎందుకు వేస్తారని ప్రజలు గట్టిగా నిలదీయడంతో మాటమార్చిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి..15 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు వెనుదిరిగారు. 

హైవేపై ఆందోళన 
అంతకుముందు.. ఎర్రగడ్డపల్లి గ్రామస్తులు హైదరాబాద్, బిజాపూర్ రోడ్డుపై బైఠాయించారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తుల నిరసనతో హైవేపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలాసేపు వాహనాలు నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి పంపించి వేశారు.