కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మొదలైన ఐపీఎస్ అధికారుల బదిలీలు

కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మొదలైన ఐపీఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అప్పుడే అధికారుల బదిలీలు మొదలయ్యాయి. ఇద్దరు IAS అధికారులను బదిలీ చేస్తూ.. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి. శివధర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని నియమించారు. 

నాలుగు రోజుల క్రితం అంటే డిసెంబర్ 4వ తేదీన అప్పటి తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సస్పెన్షన్‌ వేటు వేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌, సీఐడీ అదనపు డీజీగా ఉన్న మహేశ్‌ భగవత్‌, శాంతిభద్రతల అదనపు డీజీగా ఉన్న సంజయ్‌ కుమార్‌ జైన్‌లు.. రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

దీనిపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఈసీ నివేదిక కోరింది. నివేదిక అందిన కొద్ది నిమిషాల్లోనే డీజీపీని ఈసీ సస్పెండ్‌ చేస్తూ, ఇద్దరు అదనపు డీజీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తూ లేఖ పంపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్‌ అధికారులు రవి గుప్తా, రాజీవ్‌ రతన్‌, సీవీ ఆనంద్‌ పేర్లతో కూడిన జాబితాను ఎన్నికల సంఘానికి పంపగా గంటలోనే ఏసీబీ డీజీగా ఉన్న రవి గుప్తాను డీజీపీగా నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.