మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నడం దారుణం

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నడం దారుణం
  • బీసీల ఎదుగుదలను ఓర్వలేకే ఈ కుట్రలు
  • జీజేహెచ్పీఎస్ ( మోకు దెబ్బ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్

పాలకుర్తి: బలహీన వర్గాల నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నడం దారుణమని, ఈ కుట్ర వెనుక అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు అనుమానం కలుగుతోందన్నారు గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు తెలిపిన నేపథ్యంలో... మోకు దెబ్బ నాయకులు మంత్రి శ్రీనివాస్ హత్యకు జరిగిన కుట్రను తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా మోకు దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోశాల వెంకన్న మాట్లాడుతూ.. రాజకీయాల్లో బీసీలు ఎదగడం కొంత మంది అగ్రవర్ణ నాయకులకు అసూయగా మారిందన్నారు. అందుకే బీసీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని, వాళ్లను రాజకీయంగా సమాధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు జరిగిన కుట్ర కూడా అందులో భాగంగానే జరిగిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగులను, సబ్బండ వర్గాలను ఏకం చేసిన ఘనత శ్రీనివాస్ గౌడ్ కు దక్కిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోషించిన క్రియాశీల పాత్రకు బహుమతిగా ఆయనకు మంత్రి పదవి దక్కిందన్నారు. అలాంటి నేతను హత్య చేసేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తుండటం బాధాకరమన్నారు. ఉన్నత స్థాయి అధికారులతో ఎంక్వైరీ కమిటీ వేసి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

హత్యా రాజకీయాలను ఎప్పుడూ సమర్థించం