సామాజిక, సాంస్కృతిక జీవనానికి ప్రమాణంగా మారుతున్న రాజ్యాంగం!

సామాజిక, సాంస్కృతిక జీవనానికి ప్రమాణంగా మారుతున్న రాజ్యాంగం!

ఇటీవల  కర్నాటకలోని చిత్రదుర్గం జిల్లా కేంద్రంలోని ఓ వివాహ వేడుకల్లో  రాజ్యాంగ సందడి కనబడింది. వరుడు చేతన్, వధువు భవ్యశ్రీ పరిణయంలో ఎలాంటి ఆడంబరాలు కనిపించలేదు.  వాయిద్యాలు, వేదమంత్రాలు వినిపించలేదు. పురోహితుడి జాడే లేదు.  పాస్టర్ ప్రార్థన లేదు, మౌల్వి దీవెనలు లేవు.  వధూవరులు, వారి తల్లిదండ్రులు కల్యాణ వేదిక వద్దకు వచ్చి జాతీయ కవి కువెంపు రూపొందించిన 'మంత్ర మాంగల్య' వివాహ పద్ధతిని పాటిస్తూ.. ఒకరికొకరు తోడుగా ఉంటామని ప్రమాణాలు చేశారు. 

అనంతరం వధువు భారత రాజ్యాంగ పీఠికను చదివి వినిపించగా అందరూ ప్రతిజ్ఞ చేశారు. పది నిమిషాల్లో వేడుకలు పూర్తయ్యాయి. భారత రాజ్యాంగం సాక్షిగా కులమతాలకతీతంగా,  వరకట్న ఆచారాలతో సంబంధం లేకుండా వివాహం జరిగింది.  తమ వివాహంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇది రాజ్యాంగం పట్ల వారికున్న గౌరవాన్ని తెలియజేస్తోంది. సామాజిక సందేశాన్ని సూచిస్తోంది.
భారత రాజ్యాంగం మన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనానికి మూల స్తంభం.  

దేశ శాసన, కార్యనిర్వహణ, న్యాయశాఖలో అంతర్భాగం.  మన సంస్కృతిలో కూడా భాగమై మనల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రజల నమ్మకాలు, ఆచారాలు,  సంప్రదాయాలు,  జీవనవిధానం వంటివి రాజ్యాంగానికి లోబడే ఉంటాయి. ఇది సామరస్యం,  సహనంతో జీవించడానికి తోడ్పడుతుంది. ఈ క్రమంలో కొందరు విద్యావంతులు తమ పెళ్లి వేడుకలలో రాజ్యాంగాన్ని భాగం చేసుకుంటున్నారు. సంప్రదాయాలకతీతంగా రాజ్యాంగంపై  ప్రమాణం చేసి మనువాడుతున్నారు.  సామాజిక వివాహాల్లో రాజ్యాంగం
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ,  ఎస్సీ,  ఎస్టీల  సామాజిక, సాంస్కృతిక చైతన్య వేదికైన జంబూద్వీప జన జాగృతి ఆధ్వర్యంలో జరిగే శుభకార్యాలు రాజ్యాంగ విలువల కేంద్రంగా జరుగుతాయి.  

ముఖ్యంగా ఈ సంస్థ ఆధ్వర్యంలో జరిగే వివాహాలను  ‘సామాజిక వివాహం’ పేరుతో  నిర్వహిస్తూ సామాజిక సందేశం ఇస్తారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే రాజ్యాంగ విలువల సాక్షిగా జరిగే ఆదర్శ వివాహ పద్ధతి ఇది. ఒకనాడు జంబూద్వీపంగా పిలిచి అఖండ భారతదేశంలోని వివాహ సంస్కృతి ఇలానే ఉండేది. ఈ సోషల్ మ్యారేజ్​లో  రమాబాయి అంబేద్కర్,  సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వంటి ఆదర్శ దంపతుల జీవితగాథలను కూడా వివరిస్తారు.  

వాస్తవ జీవితానికి నిలువుటద్దం ఇలాంటి వివాహాలు.  నేడు మన ఇళ్లలో జరుపుకునే ఇతర వేడుకలలో కూడా భారత రాజ్యాంగాన్ని భాగం చేయాలి.  బారసాల, కేశఖండన, పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి వేడుకల్లో రాజ్యాంగాన్ని ప్రదర్శించి అందులోని ప్రాథమిక అంశాలు తెలుసుకోవాలి. అన్ని మతాలకు రక్షణగా నిలిచే రాజ్యాంగాన్ని ఆయా మతాల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి శుభకార్యాల్లో భాగం చేయాలి. యువతకు రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడానికి ఇది మంచి మార్గమని రాజ్యాంగ నిపుణుల భావన. 

రాజ్యాంగం పట్ల స్పృహ పెంచేలా...

రాజ్యాంగం మన జీవన విధానం,  జీవితంలో భాగం.  మన ప్రగతికి మార్గనిర్దేశం చేసే దిక్సూచి.  మనల్ని రక్షించే  గ్రంథం.  మనమంతా పుట్టుక నుంచి మరణించేవరకు రాజ్యాంగం అనే రెక్కల గూడు కిందనే బతుకుతున్నాం.  సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించగలుగుతున్నాం. మన అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నాం. కానీ,  నేడు మెజారిటీ పౌరులకు రాజ్యాంగ పట్ల అవగాహన కొరవడి రాజ్యాంగం నాకేమిచ్చిందని ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై  నమ్మకం కోల్పోతున్నారు. పాలకులు తప్పిదమే దీనికి కారణం.  మరోవైపు  ప్రభుత్వాలు  సైతం  రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాయి.  కావున,  రాజ్యాంగం పట్ల  ప్రజలు స్పృహతో  జీవించినప్పుడే  పరిష్కారం లభిస్తుంది.  

ధర్మసమాజ్​ పార్టీ పిలుపు

 తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం గురించి ప్రతి పౌరుడికి తెలియాల్సిన చారిత్రక అవసరం ఉందని  బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కన్వీనర్  డాక్టర్  విశారదన్  మహరాజ్  గతంలో  ధర్మ సమాజ్ పార్టీ వేదికగా  పిలుపునిచ్చారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.  ప్రతి పౌరుడుకి భారత రాజ్యాంగ విలువలు, ప్రాథమిక హక్కులు, విధులు బోధించాలన్నారు. రాజ్యాంగం చేతపట్టుకొని పాదయాత్రలు చేస్తూ  ప్రజల్లో  సామాజిక, రాజకీయ చైతన్యానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రభావంతో ఇటీవల ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు సైతం రాజ్యాంగం చేత పట్టుకుని ర్యాలీలు చేయడం, దాని గురించి మాట్లాడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి.

నిత్య జీవితంలో రాజ్యాంగం భాగం కావాలి

రాజ్యాంగ లక్ష్యాలను సాధించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, ప్రజలపై ఉన్నది.  రాజ్యాంగ విలువలను  బాల్యదశ నుంచే  బోధించాల్సిన అవసరం ఉంది.  కర్నాటక ప్రభుత్వం రాజ్యాంగంపై  పిల్లలకు అవగాహన కల్పించే లక్ష్యంతో అన్ని విద్యాసంస్థల్లో 
ప్రతిరోజు ఉదయం ప్రార్థన  సమయంలో  రాజ్యాంగ పీఠికను చదివిస్తుంది.  రాజ్యాంగ విలువలను తమ జీవితంలో భాగం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు.  

చత్తీస్‌గఢ్​ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులందరికీ భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు వీలుగా వారందరికీ రాజ్యాంగం పుస్తకాలను పంపిణీ చేస్తుంది.  కేరళ  ప్రభుత్వం  సవరించిన  పాఠశాల  పాఠ్యపుస్తకాల్లో  భారత రాజ్యాంగ  ప్రవేశికను చేర్చింది.  పిల్లల మనస్సులలో రాజ్యాంగ విలువలను పెంపొందించే ఇలాంటి నిర్ణయం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి.  రాజ్యాంగం పౌరులకు హక్కులను ప్రసాదిస్తూ బాధ్యతలను తెలిపే అత్యున్నత గ్రంథం.   

రాజ్యాంగ సంస్కృతిలో పిల్లలు పెరిగినప్పుడు ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుంది.  రాజ్యాంగం నిత్య జీవితంలో భాగం కావాలి. ప్రతి ఒక్కరికి  రాజ్యాంగ భాష తెలియాలి. ఇదే రాజ్యాంగ చైతన్యానికి నిదర్శనం. అప్పుడే ప్రజల సామాజిక ఆర్థిక, రాజకీయ జీవితాలలో మార్పు వస్తుంది.

‌- సంపతి రమేష్ మహారాజ్,
సోషల్​ ఎనలిస్ట్​