మత్తడి కాల్వ నిర్మాణం ఎలా?

మత్తడి కాల్వ నిర్మాణం ఎలా?

తూము కాల్వను విస్తరించేలా డిజైన్​ మారుస్తున్న ఆఫీసర్లు 

  •     పనుల కోసం రూ.3 కోట్లు మంజూరు
  •     మలుపులు తిరుగుతున్న చేర్యాల స్థల వివాదం
  •     ఎమ్మెల్యే వర్సెస్​ మాజీ ఎమ్మెల్యే

సిద్దిపేట/చేర్యాల, వెలుగు : సిద్దిపేట జిల్లా చేర్యాల పెద్ద చెరువు మత్తడి కాల్వ నిర్మాణం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మత్తడి కాల్వ నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు కావడంతో  అలైన్​మెంట్ ​విషయంపై కొన్ని రోజులుగా రగడ నెలకొంది. దీనికి తోడు ఇప్పుడు మత్తడి స్థల వివాదం ముందుకు రావడంతో కాల్వ నిర్మాణ నిర్ణయంపై ఇంకా స్పష్టత రావడం లేదు. పెద్ద చెరువు బఫర్ జోన్ స్థలం విషయంలో మొదట తండ్రి కూతుళ్ల వివాదంగా మొదలై ఇప్పుడు ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారింది. దీంతో మత్తడి కాల్వ నిర్మాణం పక్కకు పోయినట్టుగానే భావిస్తుండగా ఇరిగేషన్ ఆఫీసర్లు మాత్రం ఎవరికీ ఇబ్బంది లేకుండా కాల్వ పనులు ప్రారంభించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. 

అధికారుల మల్లగుల్లాలు 

చేర్యాల పెద్ద చెరువు మత్తడి నీళ్లు కుడి చెరువు లోకి వెళ్లడానికి నిర్మించాల్సిన కాల్వ నిర్మాణంపై ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మొదట కాల్వ  అలైన్​మెంట్​పై రైతుల నుంచి వ్యతిరేకత రాగా తరువాత బఫర్ జోన్ స్థల వివాదం ముందుకు రావడంతో బ్రేకులు పడ్డాయి. తర్వాత అధికారులు సర్వే చేశారు. రైతులకు, ఓపెన్ ప్లాట్ల కు ఇబ్బంది కలగకుండా కాల్వ నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. పెద్ద చెరువు తూము కాల్వను కొంత మేర విస్తరించి   నిర్మించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ఇలా చేస్తే ఎవరూ నష్టపోరని  భవిష్యత్తులో చేర్యాల పట్టణానికి వరద నీటి ముంపు ముప్పు ఉండదని భావిస్తున్నారు. 

జనగామ నుంచి దుద్దెడ వరకు జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుండటంతో కాల్వ కోసం రోడ్డు తవ్వే పరిస్థితి లేకపోవడంతో తూము కాల్వలోనే అలైన్​మెంట్ ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి పెద్ద చెరువు మత్తడి కాల్వకు పనులు చేపట్టేందుకు  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పెట్టిన డెడ్​లైన్​ తో ఇరిగేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కాల్వ నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు కావడంతో వెంటనే పనులు ప్రారంభించాలనే ఒత్తిడి ఇప్పుడు ఆఫీసర్లను ఆందోళనకు గురిచేస్తోంది.

సవాళ్లు ప్రతిసవాళ్లు.. 

చేర్యాల పట్టణంలోని స్థల వివాదం తండ్రి కూతూళ్ల నుంచి ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకునే వరకు వెళ్లింది. స్థలాన్ని మున్సిపాల్టీకి ఇచ్చేస్తున్నట్టు తుల్జా భవానిరెడ్డి ప్రకటనను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్వాగతించారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. దీంతో ఇద్దరి మధ్య మాట యుద్ధం ప్రారంభమైంది. 

ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు గుప్పించుకోవడం,  దీనికి తోడు జేఏసీ నేతలు సైతం రంగంలోకి దిగడంతో స్థల వివాదం మరో మలుపు తిరిగినట్టయింది. పెద్ద చెరువు బఫర్ జోన్ లోని 1270 గజాల స్థలాన్ని మున్సిపాల్టీకి అప్పగిస్తానని తుల్జా భవాని రెడ్డి ప్రకటించగా,  పక్కనే వున్న మరో 1300 గజాల స్థల యజమానులు ప్రత్యేకంగా ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. 

తూము కాల్వను పరిశీలిస్తున్నాం

పెద్ద చెరువు మత్తడి కాల్వ నిర్మాణ విషయంలో తూము కాల్వ ను కొంత మేర విస్తరిస్తే ఎవరికి ఇబ్బందులు రావనే విషయాన్ని గుర్తించాం. ఇందుకు సంబంధించిన సర్వేను పూర్తి చేశాం. కాల్వ నిర్మాణానికి రూ.3 కోట్లు సిద్ధంగా ఉండటంతో పనులను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. 

- శ్యామ్, డీఈ ఇరిగేషన్ చేర్యాల