ఆరేళ్లుగా పని చేస్తున్నం.. రెగ్యులరైజ్ చేయండి.. మత్స్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన

ఆరేళ్లుగా పని చేస్తున్నం.. రెగ్యులరైజ్ చేయండి.. మత్స్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్ : తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మత్స్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత ఆరేళ్లుగా మత్స్యశాఖలో పని చేస్తున్న తమను ఇప్పటి వరకు రెగ్యులరైజ్ చేయలేదన్నారు ఉద్యోగులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం.. ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఫిషర్ మెన్ లుగా ఉద్యోగాలు చేస్తూ గ్రామీణ స్థాయికి వరకూ తీసుకెళ్తున్నామన్నారు.

పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా.. చాలీచాలని జీతాలు ఇస్తూ వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు కూడా ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తున్నారని.. టీఏ, డీఏలు, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేపలు, రొయ్యల ఉత్పత్తిని పెంచడంతో పాటు మత్స్య సంపదను దేశ, విదేశాలకు ఎగుమతి చేయడంలో కీలక పాత్ర వహిస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారం రోజులుగా నిరసనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం దిగిరావడం లేదన్నారు. తక్షణమే తమను రెగ్యులరైజ్ చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.