యాదాద్రి ఖజానాకు కరోనా కాటు

యాదాద్రి ఖజానాకు  కరోనా కాటు

యాదగిరిగుట్ట, వెలుగు: కరోనా ప్రభావం యాదాద్రి దేవస్థానం ఖజానాపైనా పడింది. సెకండ్ వేవ్ లో టెంపుల్ లో పనిచేస్తున్న అర్చకులు, స్టాఫ్ కరోనా బారిన పడడం, యాదగిరిగుట్టలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నరసింహుడి దర్శనం కోసం యాదాద్రికి రావాలంటేనే భక్తులు వణుకుతున్నారు. ‌‌‌‌భక్తుల రాక గణనీయంగా తగ్గడంతో స్వామి ఆదాయం సైతం తగ్గింది. దీనికితోడు కరోనా నియంత్రణలో భాగంగా మార్చి 28 నుంచి ఏప్రిల్ 4 వరకు ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం వంటి పూజలన్నీ రద్దు చేయడంతో ఆలయ ఆదాయం మరింత తగ్గింది. గతంలో భక్తులు సమర్పించే కానుకలు, నిర్వహించే పలు రకాల పూజల ద్వారా ప్రతిరోజూ టెంపుల్ కు రూ.15 లక్షల వరకు ఆదాయం వచ్చేది. కరోనా విజృంభణ కారణంగా నెలన్నర నుంచి టెంపుల్ రోజువారి ఆదాయం రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలు మించడం లేదు. వారం రోజులుగా రోజువారి ఆదాయం రూ.1.5 లక్షలు దాటడం లేదు. ఇక వీకెండ్ విషయానికొస్తే గతంలో శని, ఆదివారం ఆదాయం రూ.20 లక్షలపైనే సమకూరేది. ప్రస్తుతం రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు మించడం లేదు. 

పడిపోయిన హుండీ ఆదాయం 

స్వామివారి హుండీలలో భక్తులు సమర్పించే కానుకల్లో కూడా భారీ తగ్గుదల కనిపిస్తోంది. ప్రతి 15 నుంచి 20 రోజుల మధ్య కౌంట్ చేసే హుండీల ద్వారా ఆలయానికి కనీసం రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల ఆదాయం వచ్చేది. అయితే గత నెల 6 నుంచి 28 వరకు 23 రోజుల్లో హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా కేవలం రూ.29.78 లక్షల ఆదాయం మాత్రమే వచ్చింది. వీకెండ్ వచ్చిందంటే భక్తులతో కిటకిటలాడే యాదాద్రి క్షేత్రం కరోనా కారణంగా ప్రస్తుతం భక్తులు లేక కళ తప్పింది.