పల్లెల కంటే పట్నంలోనే కరోనా ముప్పు ఎక్కువ

పల్లెల కంటే పట్నంలోనే కరోనా ముప్పు ఎక్కువ
  •     సిటీల్లోనే కరోనా ముప్పు ఎక్కువుందన్న ఐసీఎంఆర్​
  •     సెకండ్​ సీరో సర్వేలో వెల్లడి.. ఫస్ట్​ చేసిన ప్రాంతాల్లోనే స్టడీ
  •      పండుగలొస్తున్నయ్​.. జర పైలమన్న కేంద్రం

పల్లెలతో పోలిస్తే పట్టణాల్లోనే కరోనా ముప్పు ఎక్కువుందని ఐసీఎంఆర్​ తేల్చింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్​ 22 మధ్య 21 రాష్ట్రాల్లో 70 జిల్లాల్లోని 700 పల్లెలు, పట్టణాలపై చేసిన స్టడీ వివరాలను మంగళవారం వెల్లడించింది. పదేళ్లు దాటిన ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా ముప్పు ఉందని హెచ్చరించింది. రెండు మూడు నెలల్లో వరుస పండుగలు రాబోతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

న్యూఢిల్లీ: పల్లెలతో పోలిస్తే పట్టణాల్లోనే కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నట్టు ఇండియన్​ కౌన్సిల్​ ఫర్​ మెడికల్​ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​) తేల్చింది. అందులోనూ పట్టణాల్లోని మురికివాడల్లోనే ఆ ప్రమాదం మరింత ఎక్కువున్నట్టు నిర్ధారించింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్​ 22 మధ్య చేసిన రెండో సీరో సర్వేలో ఈ విషయాన్ని తేల్చింది. ఫస్ట్​ సీరో సర్వే చేసిన ప్రాంతాల్లోనే రెండో సీరో సర్వేనూ చేసింది. మొత్తంగా 21 రాష్ట్రాల్లో 70 జిల్లాల్లోని 700 పల్లెలు, పట్టణాలపై స్టడీ నిర్వహించింది. ఆ రిపోర్టును మంగళవారం విడుదల చేసింది. పదేళ్లు దాటిన ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా ముప్పు ఉందని హెచ్చరించింది. పట్టణాల్లోని నాన్​స్లమ్​ ఏరియాలతో పోలిస్తే పట్టణ మురికివాడల్లో కరోనా ముప్పు రెట్టింపు ఉందని రిపోర్ట్​లో ఐసీఎంఆర్​ పేర్కొంది. అర్బన్​ స్లమ్స్​లో కరోనా రిస్క్​ 15.6 శాతం ఉండగా, నాన్​ స్లమ్స్​లో 8.2% ఉందని చెప్పింది. పల్లెల్లో ఆ ముప్పు చాలా తక్కువేనని, కేవలం 4.4 శాతమే ఉందని తెలిపింది. మేతో పోలిస్తే ఆగస్టులో ఇన్​ఫెక్షన్​ రేటు తగ్గిందని చెప్పింది. దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్యను భారీగా పెంచడంతో వెనువెంటనే కేసులను గుర్తించగలుగుతున్నారని వెల్లడించింది. సోషల్​ డిస్టెన్స్​ పాటించడంతో పాటు మాస్కులను తప్పనిసరిగా పెట్టుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. రాబోయే నెలల్లో వరుస పండుగలు రాబోతున్నాయని, జనం ఎక్కడా ఎక్కువ గుమికూడద్దని సలహా ఇచ్చింది. కరోనా కట్టడికి కొత్త వ్యూహాలను అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.