
- కౌన్సిల్ మీటింగ్ నుంచి ఎంపీ ఈటల, ఎమ్మెల్యే మల్లారెడ్డి వాకౌట్
మేడిపల్లి, వెలుగు: పీర్జాదిగూడ కౌన్సిల్ మీటింగ్ లో కార్పొరేటర్ల ప్రశ్నలతో నిలదీయడంతో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వాకౌట్ చేశారు. మంగళవారం పీర్జాదిగూడ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొనగా.. ఇందులో మేయర్ జక్కా వెంకటరెడ్డి అవినీతిపై పలువురు కార్పొరేటర్లు నిలదీయగా, సమాధానం చెప్పలేక 5 నిమిషాల్లోనే వాకౌట్ చేసి వెళ్లిపోయారు. మెజారిటీ సభ్యుల మద్దతులేని మేయర్ మీటింగ్ ఎలా నిర్వహిస్తారని మరికొందరు కార్పొరేటర్లు నిరసనలు తెలిపారు.
ఇలాంటి గందరగోళ పరిస్థితి చూసి వెంటనే ఈటల వెళ్లిపోగా.. సర్దిచెప్పటానికి ప్రయత్నించిన మల్లారెడ్డి ప్రయత్నాలు ఫలించకపోగా కాసేపటికి ఆయన కూడా వెనుదిరిగి వెళ్లారు. దీంతో పీర్జాదిగూడ మేయర్ వెంకట్ రెడ్డికి కూడా భంగపాటు తప్పలేదు. మెజారిటీ సభ్యుల మద్దతు లేని మేయర్ చేసేదేమీ లేక సభను వాయిదా వేస్తూ ముగించారు.