అంతకంతకూ పెరుగుతోన్నసెక్రటేరియెట్​ నిర్మాణ ఖర్చు

అంతకంతకూ పెరుగుతోన్నసెక్రటేరియెట్​ నిర్మాణ ఖర్చు

 

  • చెప్పింది రూ. 400 కోట్లు.. బడ్జెట్​లో పెట్టింది 619 కోట్లు
  • ఎలివేషన్ డిజైన్లలో జాప్యంతో మరింత పెరిగిన వ్యయం
  • ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధమంటున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్​ నిర్మాణ ఖర్చు అంతకంతకూ పెరిగిపోతున్నది. అనుకున్న టైంలో నిర్మాణం పూర్తి చేయకపోవడంతో ఖర్చు తడిసిమోపెడవుతున్నది. ముందు వేసుకున్న అంచనాలు ఎప్పటికప్పుడు మారుతుండటం, ఎలివేషన్​ డిజైన్లలో మార్పులు చేయడంతో కట్టడం పూర్తయ్యే నాటికి రూ. 1,200 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని ఆఫీసర్లు అంటున్నారు. అయితే  ఎంత ఎక్కువ ఖర్చయినా పర్లేదని నిర్మాణ సంస్థ షాపూర్​జీ పల్లోంజీకి రాష్ట్ర సర్కార్  హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ లెక్కలు అన్ని నిర్మాణం చివరి దశకు చేరుకున్నాక ఫైనల్​ చేయనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కన్సల్టేషన్​ చార్జీలు పెంచాలని కోరుతూ షాపూర్​ జీ పల్లోంజీ రాష్ట్ర సర్కార్​కు లేఖ రాసింది. గత నవంబర్​లో పూర్తయిన సర్వీస్​ పీరియడ్​ను 
ప్రభుత్వం ఇప్పటికే పొడిగించింది. 

రూ. 400 కోట్ల నుంచి మొదలు..!

ఆరు ఫ్లోర్లు.. ఆరు లక్షల చదరపు అడుగుల్లో సెక్రటేరియెట్​ నిర్మాణానికి రూ.400 కోట్లు అవుతుందని తొలుత లెక్కలు క‌‌ట్టి బడ్జెట్​ రిలీజ్​ ఆర్డర్​ ఇచ్చారు. ఆ  తర్వాత టెండర్లప్పుడు అది కాస్తా రూ. 494 కోట్లకు చేరింది. షాపూర్​జీ పల్లోంజీ 4 శాతం ఎక్కువగా రూ. 514 కోట్లు కోట్‌‌ చేసి టెండర్‌‌ ప్రక్రియలో ఎల్-1 గా నిలిచింది. కొద్ది రోజుల‌‌కే ఈ అంచ‌‌నాల‌‌ను పెంచారు. 

ఒక ఫ్లోర్ పెరిగిందని, ఇంకో లక్ష చదరపు అడుగులకు అంచనా వ్యయం రూ. 219 కోట్లు అవుతుందంటూ మొత్తం కాస్ట్​ రూ.619 కోట్లకు చేర్చారు.  ఈ మేరకు బడ్జెట్​ కేటాయింపులు జరిగాయి. ఆ తర్వాత ధరలు పెరిగినందున నిర్మాణ ఖర్చు రూ.800 కోట్లు అవుతుందన్నారు. అది మళ్లీ రూ.వెయ్యి కోట్లకు చేరింది. ఇట్లా ప‌‌నులు పూర్తయ్యే నాటికి ఖర్చు రూ.1,200 కోట్లు చేరుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ మేరకు ప్రపోజల్స్​ రెడీ చేసినట్లు సమాచారం.  

ఏడాదిలో పూర్తి చేస్తమన్నరు.. కానీ..!

సెక్రటేరియెట్​ నిర్మాణం టెండర్లు 2020 అక్టోబర్​లో షాపూర్​జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. 12 నెలల్లోపు పనులు పూర్తి చేయాలని టెండర్‌‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, కరోనాతో కూలీలు ఇంటికి వెళ్లడంతో పనులు కొంతకాలం నిలిచిపోయాయి. ఆ తర్వాత డిజైన్లు మార్పులు చేస్తూ వస్తున్నారు. రెడ్​ స్టోన్​ వంటివి తీసుకురావడం, సర్కార్​ అప్పటికప్పుడు మార్పులు సూచిస్తుండటం, ఎలివేషన్,  టైల్స్​, హాల్స్​, పిల్లర్స్​ డిజైన్లు మార్చడంతో మరింత ఆలస్యం అవుతూ వస్తున్నది. ఈసారి దసరా లోపు సెక్రటేరియెట్​ నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్​గా పెట్టుకున్నారు. 

ఇతర నిర్మాణాలపై దృష్టి లేదు

సెక్రటేరియెట్​ నిర్మాణంపై ఉన్న ఆసక్తి ఇతర ప్రభుత్వ నిర్మాణలపై సర్కార్​ పెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే డబుల్​ బెడ్రూం ఇండ్ల విషయంలో అర్హుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. మరోవైపు సెక్రటేరియెట్​కు 200 మీటర్ల దూరంలో నిర్మించ తలపెట్టిన 150 అడుగుల అంబేద్కర్​ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం–స్మృతి వనం పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. సెక్రటేరియెట్​కంటే ముందే వీటిని ప్రపోజ్​ చేశారు. అయితే.. వీటిని పూర్తి చేసేందుకు ఇంకో ఏడాదైనా టైం పడుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇప్పటివరకు సెక్రటేరియెట్​ నిర్మాణ పనులను కేసీఆర్​ స్వయంగా వచ్చి 5 సార్లు పరిశీలించారు. అదే అంబేద్కర్ ​విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం, అమరవీరుల స్మారక స్తూపాన్ని విజిట్​ చేయలేదని విమర్శలు ఉన్నాయి. ఇక 40 ఆత్మగౌరవ భవనాలకు భూములు కేటాయించడమే తప్ప వాటి నిర్మాణాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.