అక్టోబర్‌‌‌‌లో తగ్గిన వెజ్‌‌, నాన్‌‌వెజ్‌‌ థాళీల ఖర్చు.. కూరగాయల ధరలు దిగిరావడమే కారణం

అక్టోబర్‌‌‌‌లో తగ్గిన వెజ్‌‌, నాన్‌‌వెజ్‌‌ థాళీల ఖర్చు.. కూరగాయల ధరలు దిగిరావడమే కారణం

న్యూఢిల్లీ: కూరగాయల ధరలు తగ్గడంతో ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌లో ఇంట్లో వండే వెజిటేరియన్‌‌ థాళీల (మీల్స్‌‌) ఖర్చు ఏడాది లెక్కన 17 శాతం, నాన్-వెజ్ థాళీల ఖర్చు 12శాతం తగ్గాయి. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఇంటెలిజెన్స్‌‌ విడుదల  చేసిన రోటి రైస్‌‌ రేట్‌‌ (ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌) రిపోర్ట్ ప్రకారం, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పప్పుల ధరలు భారీగా పడిపోవడమే ఇందుకు  ప్రధాన కారణం. 

బంగాళాదుంప ధరలు కిందటి నెలలో ఏడాది లెక్కన 31శాతం తగ్గగా, టమాటా ధరలు 40శాతం పడిపోయాయి. ఉల్లిపాయ ధరలు 51శాతం తగ్గడానికి రబీ సీజన్ నిల్వలు ఎక్కువగా ఉండటం, ఎగుమతులు తగ్గిపోవడం కారణమని రిపోర్ట్ పేర్కొంది. పప్పుల ధరలు 17శాతం తగ్గాయి. ముఖ్యంగా శనగలు, పసుపు పచ్చి బటానీలు, మినుముల దిగుమతులు భారీగా పెరగడంతో  పప్పుల ధరలు దిగొచ్చాయి. అయితే, పండుగల డిమాండ్ కారణంగా వంటనూనె ధరలు 11శాతం పెరిగాయి. 

ఎల్‌‌పీజీ  సిలిండర్ ధర 6శాతం పెరగడం వల్ల థాళీ ఖర్చు భారీగా పడిపోలేదు.  బ్రాయిలర్ కోళ్ల ధరలు కేవలం 6శాతం మాత్రమే తగ్గడంతో అక్టోబర్‌‌‌‌లో  నాన్-వెజ్ థాళీ ఖర్చు తక్కువగా తగ్గింది.  బ్రాయిలర్ కోళ్ల ఖర్చు మొత్తం థాళీ ఖర్చులో సగం వరకు ఉంటుంది.  నెలవారీగా చూస్తే, ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌తో పోలిస్తే  అక్టోబర్‌‌లో వెజ్ థాళీ ఖర్చు 1శాతం, నాన్-వెజ్ థాళీ ఖర్చు3శాతం తగ్గింది. ఉల్లిపాయ ధరలు 3శాతం, టమాటా ధరలు  8శాతం దిగొచ్చాయి.  ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌లో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 1.54శాతంగా నమోదై, జూన్ 2017 తర్వాత కనిష్ట స్థాయికి చేరింది. అక్టోబర్‌‌‌‌ నెలకు సంబంధించి సీపీఐ డేటా ఈ నెల 13న వెలువడనుంది.