
రాష్ట్రంలో నిజాం పాలన
హైదరాబాద్, వెలుగు: కరీంనగర్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు పెట్టాలని కోర్టు ఆదేశించడం సీఎం కేసీఆర్ కు చెంపపెట్టులాంటిదని బీజేపీ సీనియర్ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ అంటే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమా అని ఆయన మండిపడ్డారు. ఆనాటి నిజాం పాలనకు, ఇప్పటి కేసీఆర్ పాలనకు తేడా లేదని విమర్శించారు. యునాని ఆస్పత్రి మజ్లిస్ సొత్తు కాదని, స్టూడెంట్స్పై మజ్లిస్ దాడులను ఖండిస్తున్నామన్నారు.
గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకునే హక్కు ఈ రాష్ట్ర ప్రజలకు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు కాకతీయుల పాలనను కోరుకుంటే కేసీఆర్ మాత్రం నిజాం పాలనను అందిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడంపై కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల ముందు రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్లలో వేస్తామని చెప్పిన కేసీఆర్.. ఇంత వరకు వేయకపోవడం ఏమిటని నిలదీశారు.