ఆకలితో అలమటిస్తున్న మేకపిల్లలకు పాలిస్తున్న ఆవు

ఆకలితో అలమటిస్తున్న మేకపిల్లలకు పాలిస్తున్న ఆవు

అమ్మతనంలోని ఔన్నత్యాన్ని చాటిచెబుతోంది ఈ గోమాత. ఆకలితో అలమటిస్తున్న మేక పిల్లలకు పాలిస్తూ అమ్మ ప్రేమకు మూగజీవాలు అతీతం కాదని నిరూపిస్తుంది. వికారాబాద్ జిల్లా దోమ మండలం మల్లెపల్లికి చెందిన గుణవర్ధన్ వ్యవసాయంతో పాటు పాడి పశువులను పోషిస్తుంటాడు. అతనికి చెందిన ఓ మేక నాలుగు మేక పిల్లలకు జన్మనివ్వగా.. వాటిని ఆవుతో కలిపి మేతకు పంపిస్తుంటాడు. అయితే నాలుగు మేక పిల్లలకు మేక వద్ద సరిపడా పాలు లేక ఆకలితో అలమటించేవి. అందులోని రెండు మేక పిల్లలు లేగదూడతో  పాటు ఆవు వద్ద పాలు తాగడం ఆరంభించాయి. మేక పిల్లలు పాలు తాగినా ఆవు మౌనంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆవు మేకల మాతృ బంధాన్ని చూస్తే చాలా ముచ్చటగా ఉందని ఆవు యజమాని గుణవర్ధన్ సంతోషం వ్యక్తం చేశారు. కులం, మతం పేరుతో కొట్టుకుంటున్న మానవ జాతి...జాతులు వేరైనా ఒక్కటిగా కలిసిఉండే మూగ జీవులను చూసి చాలా నేర్చుకోవాలని అతడు సూచిస్తున్నాడు.