లాక్ డౌన్ ఎఫెక్ట్..కూలీలు దొరకక రైతుకు ఇక్కట్లు

లాక్ డౌన్ ఎఫెక్ట్..కూలీలు దొరకక రైతుకు ఇక్కట్లు
  • నెలరోజులుగా కూలీలు దొరకక.. ట్రాన్స్​పోర్టేషన్​ లేక తిప్పలు
  • అతికష్టమ్మీద పంటలను మార్కెట్​కు తరలించినా దక్కని గిట్టుబాటు ధర

రాష్ట్రంలో పూలు, మామిడి, బత్తాయి, కూరగాయల రైతులు నెల రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు దొరకక.. ట్రాన్స్​పోర్టేషన్​ లేక.. సాగుచేసిన పంటలను ఎక్కడికక్కడ వదిలేస్తున్నారు. అతికష్టమ్మీద వాటిని తెంపి, సొంత వెహికల్స్​లో మార్కెట్​కు తరలించినా గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4.42 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పండ్లతోటలు సాగవుతున్నాయని ఉద్యాన శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో మెజారిటీ వాటా మామిడిదే. మొత్తం 3.07 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. 62 వేల ఎకరాల్లో పండుతున్న బత్తాయి రెండో ప్లేస్​లో ఉంది. మొత్తంగా ఈ సీజన్లో 25.69 లక్షల టన్నుల పండ్ల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అంచనావేసింది. ఇక 8 వేల నుంచి 10వేల ఎకరాల్లో బంతి, చామంతి, మల్లె, కనకాంబరాలు సాగవుతున్నాయి. వివిధ పాలీహౌజ్​ల పరిధిలోని 500 ఎకరాల్లో సాగవుతున్న డెకరేటెడ్ పూలు వీటికి అదనం. మరో 4 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగవుతున్నాయని ఉద్యాన శాఖ అంచనా.

పూలకు గిరాకీ లేదు

కరోనా కారణంగా పూలకు డిమాండ్ తగ్గింది. భారీ పెట్టుబడి పెట్టి పూల సాగు చేపట్టిన రైతులు మార్కెట్ లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటా మార్చి, ఏప్రిల్​, మేలో పెండ్లిళ్లు, ఫంక్షన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ వేడుకల్లో డెకోరేషన్​కోసం పూలకు డిమాండ్​ ఉంటుంది. కరోనా కట్టడి కోసం లాక్​డౌన్​ విధించడంతో పెండ్లిళ్లు లేవు.. ఫంక్షన్లు లేవు.. చివరికి గుళ్లు కూడా మూతపడ్డాయి. దీంతో పూలకు డిమాండ్​ పూర్తిగా తగ్గిపోయింది. హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ ద్వారా సబ్సిడీ వస్తుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో కొందరు  రైతులు పాలీహౌజ్​లలో పూలు సాగు చేస్తున్నారు. జిల్లాలోని శివ్వంపేట, నర్సాపూర్, కౌడిపల్లి, మెదక్, వెల్దుర్తి, చేగుంట, కొండాపూర్, జహీరాబాద్, కొహీర్ మండలాల్లో  40 ఎకరాల విస్తీర్ణంలో పాలీహౌజ్ ద్వారా పూల సాగు చేస్తున్నారు. లాక్​డౌన్​ వల్ల నెల రోజులనుంచి పెండ్లిళ్లు, ఫంక్షన్లు లేకపోవడం, ఆలయాలు మూతపడడంతో పూలకు గిరాకీ లేకుండా పోయిందని రైతులు అంటున్నారు. హైదరాబాద్ మార్కెట్​కు తరలిద్దామన్నా వెహికల్స్ అందుబాటులో లేవని చెబుతున్నారు.  దీంతో పూలు చెట్ల మీదనే వాడిపోతున్నాయని, తమ కష్టం బూడిదపాలవుతోందని రైతులు బాధపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మహబూబ్​నగర్ లాంటి జిల్లాల్లోని వేలాది ఎకరాల్లో బంతి, లిల్లీ పూలు సాగుచేసిన రైతుల పరిస్థితి కూడా ఇలానే ఉంది.

మామిడి దిగుబడి సగమే..

రాళ్లవానలతో పూత, కాత రాలి మామిడి దిగుబడి ఇప్పటికే  సగానికి తగ్గింది. నెలరోజులుగా కరోనా ఎఫెక్ట్​ వల్ల మామిడి రైతులను మరింత దెబ్బతింటున్నారు. కూలీలు తోటల్లోకి వచ్చి కాయలు తెంపడానికి భయపడుతున్నారు. జగిత్యాల జిల్లాలో 33 వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఈ సీజన్​లో  66 వేల టన్నుల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. జిల్లాలో ఏటా రూ. 90 కోట్లకు పైగా మామిడి వ్యాపారం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు మామిడిని ఎగుమతి చేస్తారు. కానీ ఇప్పుడు ట్రాన్స్​పోర్ట్​ నిలిచి, కాయలన్నీ చెట్లమీదే వదిలేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోనూ ఇదే పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో 15 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. గాలివానతో పూత రాలిపోవడంతో దిగుబడులు సగానికి తగ్గాయి. నిరుడు మహిళా సంఘాల ద్వారా 4 వేల టన్నుల మామిడికాయలను హైదరాబాద్ లోని మాల్స్​కు, ఇతర దేశాలకు పంపించారు. ఈసారి ఆ పరిస్థితి లేకపోవడంతో హైదరాబాద్, రాయలసీమ, కర్నాటకకు రవాణా చేస్తున్నారు. ఉద్యాన శాఖ ద్వారా రోజుకు 75 వేల టన్నుల మామిడిని 25 వెహికల్స్​లో తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 9320 మంది రైతులు 30,660 ఎకరాల్లో మామిడి తోటలు వేశారు.  చెడగొట్టు వానలు, తేమ వల్ల ఈసారి కాత 20 శాతం తగ్గిందని, అయినా 92 వేల టన్నుల వరకు దిగుబడి ఉంటుందని హార్టికల్చర్ ఆఫీసర్లు చెప్తున్నారు. లాక్ డౌన్ వల్ల కాయలు తెంపి అమ్ముకునే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఈ సమయానికే ఢిల్లీ తదితర చోట్ల నుంచి  వ్యాపారులు తోటల దగ్గరకు వచ్చి టోకున కొనేవారు. వీరిలో ఎక్కువ మంది మామిడిని ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. కరోనా వల్ల ఈసారి ఆ వ్యాపారులు రావడం లేదు. మంచిర్యాల జిల్లాలో 18 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగుచేశారు. ఇక్కడ ఈ సారి 16 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. 500 క్వింటాళ్లు మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయాలనుకున్నారు. మిగతా పంటను బయట అమ్ముకోవాల్సిందే. లాక్ డౌన్ వల్ల కూలీలు వస్ల. నాగ్ పూర్, నాందేడ్, హైదరాబాద్ మార్కెట్లకు మామిడి కాయలు తరలించేందుకు వెహికల్స్​ దొరకడం లేదు.

బత్తాయికీ ట్రాన్స్​పోర్టు ప్రాబ్లమ్​

నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇటీవల వీటి ట్రాన్స్​పోర్ట్​ కోసం సర్కారు తీసుకున్న చర్యలు మధ్యలోనే నిలిచిపోయాయి. హైదరాబాద్​లోని కొత్తపేట మార్కెట్​ను కోహెడకు తరలించడంతో ఈ నెల 27 వరకు  బత్తాయిలు తీసుకురావద్దని అధికారులు చెప్పారు. నల్గొండ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన బత్తాయి రవాణా కూడా ఆగింది. ఢిల్లీలోని ఆగంపూర్ మార్కెట్​లో కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడి ట్రేడర్స్ ఎవరూ రావడం లేదు. నల్గొండలో ఏర్పాటు చేసిన మార్కెట్​లో కూడా అంతంత మాత్రంగానే కొనుగోళ్లు జరుగుతున్నాయి. బుధవారం 9 టన్నుల కాయలు రాగా, టన్ను బత్తాయి రూ. 10,800కు అమ్ముడు పోయింది. రేటు గిట్టుబాటు కాకపోవడంతో రిటైల్ మార్కెట్​లోనే  రోజుకు రెండు, మూడు టన్నులు అమ్ముతున్నారని అధికారులు చెప్పారు.

కూరగాయలు అమ్ముకునేదెట్ల?

కూలీల కొరత, రవాణా కష్టాలు, ధరలు లేకపోవడంతో పండించిన కూరగాయలను రైతులు తోటల్లోనే వదిలేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, మాక్లూర్, జక్రాన్‍పల్లి, నందిపేట్, డిచ్‍పల్లి, బాల్కొండ మండలాల్లో కూరగాయలు సాగు ఎక్కువ.2 వేల ఎకరాల్లో టమాట, 500 ఎకరాల్లో కొత్తిమీర పంట వేశారు. కోసేవారు లేక, వెహికల్స్ దొరకక  పంటలను చేన్లలోనే వదిలేశారు. మిగతా కూరగాయలు పండించిన రైతులు కూడా ట్రాన్స్​పోర్ట్ లేక నష్టపోతున్నారు. ఆదిలాబాద్​ జిల్లాలోనూ  రైతులు కూరగాయలు, దోసకాయ, కర్బుజా పంటలేశారు. కూరగాయల్ని తెంపి అమ్ముకునే వీలులేక చేన్లలోనే వదిలేస్తున్నారు. గతంలో కూరగాయల్ని వారం అంగళ్లలో అమ్ముకునేవారు. లాక్ డౌన్ వల్ల అంగళ్లు బంద్ కావడంతో చేతికొచ్చిన పంటను కూడా కోసి అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది.

రోజుకు పదివేలు నష్టం

అర ఎకరంలో లిల్లీ పూలు సాగు చేసిన. ఇప్పుడు పెండ్లిళ్లు, పూజలు బంద్ కావడంతో పూలకు గిరాకీ లేదు. లాక్ డౌన్ కారణంగా మార్చి 21 తర్వాత ఒక్క పువ్వు కూడా తెంపలేదు. బెంగళూరు నుంచి మేలు రకం విత్తనాలు తేవడంవల్ల పెట్టుబడి లక్షలన్నర దాకా అయింది. రోజుకు 100 కిలోల పూలు వస్తాయి.  రోజూ రూ. 10 వేల దాకా లాస్ అయితున్నం. గిరాకీలేక చేన్లనే పూలు ఎండి పోతున్నయి.

-సంపత్ రెడ్డి,  సదాశివ పల్లి, కరీంనగర్  జిల్లా

దళారులు చెప్పిందే రేటు

కరోనా కారణంగా మామిడికాయలు కోసేందుకు కూలీలు రావడంలేదు. ఎక్కువమంది రావాల్సిఉంటుందని భయపడుతున్నారు. గతంలో వాతావరణం అనుకూలించక నష్టపోతే ఈసారి కరోనా మహమ్మారి దెబ్బకొట్టింది.  మార్కెట్లలో దళారులు చెప్పిందే రేటుగా మారింది. చిన్నరైతులు నష్టపోకుండా ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా చర్యలు తీసుకోవాలి.

– సుంకర వెంకయ్య, పెనుబల్లి, ఖమ్మం జిల్లా

ప్రభుత్వం ఆదుకోవాలి

నేను ప్రతిసారి మామిడి తోటలను కౌలుకు తీసుకుంట. ఈ సీజన్ల కూడా లక్షల్లో పెట్టుబడి పెట్టి తోటలు తీసుకున్న. సీజన్ మొదట్లో వాతావరణం బాగాలేక పూత సరిగా రాలే. దీంతో దిగుబడి తగ్గిపోగా కోత టైం లో కరోనా ఎఫెక్ట్​ పడింది. మామిడి కాయలు కొనేందుకు ఇతర రాష్ట్రాల వ్యాపారులు వస్తలేరు. పెట్టుబడైనా వస్తుందా రాదా అని టెన్షన్ పట్టుకుంది. మామిడి మార్కెట్​ను లాక్​డౌన్ నుంచి మినహాయించి  ఆదుకోవాలి.

– ఎం.ఏ. మొఖీమ్, కౌలు రైతు,మెట్​పల్లి, జగిత్యాల జిల్లా

తోటలనే ఇడిసిపెడుతున్నం

ఎన్నడూ ఇసుంటి పరిస్థితి చూడలే. రెండెకరాల్లో టమాట, కొత్తిమీర పంట ఏసినం. ఒక్క డబ్బా టమాట కూడా అమ్మింది లేదు. లక్షన్నర విలువైన కొత్తిమీర పంటను రూ. 20 వేలకు అమ్ముకున్న. టమాట కొనేటందుకు వ్యాపారులు వస్తలేరు. కూలీలు కూడా కరోనా భయంతో బైటికి వస్తలేరు. తెంపుకున్న కాడికి తెంపుకొని మిగతాదంత తోటలనే ఇడిసిపెడుతున్నం. ఇసుంటి దినం మా తాతలు చూడలే. మాతండ్రులు కూడా చూడలే.

– వెంకట్‍రెడ్డి, అంకాపూర్, ఆర్మూర్ మండలం, నిజామాబాద్ జిల్లా