నిర్మల్, వెలుగు : నిర్మల్జిల్లాలోని నర్సాపూర్ (జీ) మండల కేంద్రంతో పాటు మరికొన్ని గ్రామాలలో దళితబంధు కింద టీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు, పైసలున్నోళ్లను ఎంపిక చేశారని.. అర్హులకు అన్యాయం చేశారంటూ ఆయా గ్రామాల దళితులు సోమవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన దళితులు నేరుగా మంత్రి ఇంటికి చేరుకొని భైఠాయించారు. మంత్రి లేకపోవడంతో వారంతా ఆయన పీఏకు వినతిపత్రం ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్వెళ్లి ధర్నా చేశారు. దళితబంధు కింద ఎంపిక చేసిన వారిలో టీఆర్ఎస్కార్యకర్తలే కాకుండా వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులు ఉన్నారని, పేద దళితులను ఎంపిక చేయలేదంటూ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. కాగా, ఆదివారం కొంతమంది దళితులు నర్సాపూర్ జీ పంచాయతీ ముందు ఇదే సమస్యపై ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే.
