12 కోట్ల బడ్జెట్ .. 6 నెలలకే కొట్టుకపోయినయ్‌‌!

12 కోట్ల బడ్జెట్ .. 6 నెలలకే కొట్టుకపోయినయ్‌‌!

కరీంనగర్ రూరల్, వెలుగు: రూ. 12 కోట్లతో కట్టిన చెక్​డ్యామ్‌‌లవి. ఆరు నెలలు కూడా కాకుండానే ఇటీవలి వరదల తాకిడికి కట్టలు కొట్టుకుపోయాయి. కరీంనగర్ ​రూరల్​ మండలంలోని నగునూర్, మానేర్​వాగులపై ఎలబోతారం, ముగ్ధుంపూర్, ఇరుకుల్ల​ గ్రామాల్లో చెక్​డ్యామ్‌‌లను  నిర్మించారు. కాంట్రా క్టర్​ పనులను సబ్​కాంట్రాక్ట్​కు ఇవ్వడం, పర్యవేక్షించాల్సిన ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరించడంతో పనులు ఇష్టానుసారం చేశారు. మంత్రి గంగుల ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో నిర్మించిన ఈ చెక్​డ్యామ్‌‌లు ఆరు నెలలకే దెబ్బతినడం చర్చనీయాంశంగా మారింది. 
ముగ్ధుంపూర్‌‌‌‌‌‌‌‌లో రూ.6.99కోట్ల ఫండ్​తో నిర్మించిన చెక్​డ్యామ్​ కరకట్టకు రెండుచోట్ల గండిపడి భారీగా కోతకు గురై పనులు పూర్తికాక ముందే తెగిపోయింది. నెల క్రితం కురిసిన భారీ వర్షాలకు రూ.దాదాపు 5కోట్లకు పైగా ఫండ్స్‌‌‌‌తో నిర్మించిన గోపాల్​పూర్ చెక్​డ్యామ్ ​కరకట్ట వరద తాకిడికి పూర్తిగా కొట్టుకుపోయి వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కరీంనగర్ శివారు  బొమ్మకల్‌‌‌‌లో మానేరు వాగుపై నిర్మించిన చెక్​డ్యామ్​ కూడా నెల క్రితం ఎల్ఎండీ డ్యామ్ గేట్లు 
ఎత్తడంతో వరద తాకిడికి కొట్టుకుపోయింది. 
నాసిరకం పనులే కారణం..
కాంక్రీట్ పనుల్లో వాగులోనే దొరికే నల్ల ఇసుక వాడడం, చెక్​డ్యామ్‌‌కు ఇరువైపులా నిర్మించిన కరకట్టకు నాణ్యతలేని మట్టి పోయడం, రోలింగ్​ చేయకపోవడం, బ్యాక్ వాల్స్ నిర్మించకపోవడం, సైడ్ బర్మ్స్‌‌‌‌ పటిష్టంగా కట్టకపోవడం,కరకట్టలకు ఇరువైపులా సైడ్​బర్మ్స్‌‌‌‌ వేయకుండా ఒకే వైపు వేయడం, చెక్​ డ్యామ్‌‌‌‌కు వెళ్లే దారులను సైతం స్థానికంగా దొరికే మట్టితో నిర్మించడంతోనే  దెబ్బతిన్నాయని  స్థానికులు పేర్కొంటున్నారు. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని
 కోరుతున్నారు.