తేల్చేది మునుగోడే.. వేచి చూసే ధోరణిలో అసంతృప్త నేతలు

తేల్చేది మునుగోడే.. వేచి చూసే ధోరణిలో అసంతృప్త నేతలు
  • ఉప ఎన్నిక ఫలితాల దాకా వేచి చూసే ధోరణిలో అసంతృప్త నేతలు
  • రిజల్ట్స్​ను బట్టి నిర్ణయం తీసుకునేలా ప్లాన్​
  • అనుచరులతో ఇదే విషయం చెప్తున్న లీడర్లు
  • అందరి చూపూ మునుగోడు వైపే

పార్టీలో టికెట్ వస్తుందన్న ధీమా లేక కొందరు.. అసమ్మతి, వర్గపోరు పడలేక కొందరు.. ఏ అవకాశం రావడం లేదన్న నిరాశతో మరికొందరు.. ప్రాధాన్యం దక్కడం లేదన్న కోపంతో ఇంకొందరు.. ఇలా కారణాలు ఏవైనా రాష్ట్రంలో చాలామంది లీడర్లు అదును కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత పార్టీ నుంచి బయటకు వెళ్తే, ఏ రాజకీయ పార్టీలో చేరాలో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చినవాళ్లు సైతం తొందరపడొద్దనే భావనతో వెయిట్​అండ్​ సీ పాలసీ అనుసరిస్తున్నారు. వీరికి ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక రూపంలో మంచి చాన్స్​వచ్చింది.  అక్కడ వచ్చే రిజల్ట్ ను బట్టి ఫైనల్​ డెసిషన్​ తీసుకోవచ్చని ఆలోచిస్తున్నారు. తమ అనుచరులకు కూడా ఇదే విషయం చెప్తుండడంతో ఇప్పుడు అందరి చూపూ మునుగోడు వైపే ఉంది. 

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో రాజకీయాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరి ఇంట్రస్టు ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల మీదనే ఉంది. అక్కడ ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతాయి, ఎవరు గెలుస్తారనే చర్చ సామాన్యుల్లో విస్తృతంగా జరుగుతోంది. అక్కడి ఓటర్లు ఇచ్చే తీర్పు ఒక్క మునుగోడులోనే కాదు, రాష్ట్రంలో చాలాచోట్ల రాజకీయ మార్పులకు కారణం కానుంది. ఇప్పటికే నాయకుల ఓవర్ ఫ్లోతో అధికార టీఆర్ఎస్​లో టికెట్ల కోసం ప్రతిచోట ఇద్దరికి మించి పోటీ ఉంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా లాంటిచోట్ల టీఆర్ఎస్​తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన లీడర్లు, కాంగ్రెస్, టీడీపీలో గెలిచి అధికార పార్టీలో చేరిన నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కనివాళ్లు పార్టీ మారైనా సరే పోటీలో ఉంటామన్న హింట్స్​ఇస్తున్నారు. అలాంటి నాయకుల్లో చాలామంది మునుగోడు ఉప ఎన్నికల వైపే చూస్తున్నారు. అక్కడ బీజేపీ గెలుస్తుందా, టీఆర్ఎస్​ గెలుస్తుందా? కాంగ్రెస్​ సీటు నిలుపుకుంటుందా అనేది తేలిన తర్వాతే చేరబోయే పార్టీపై తుది నిర్ణయం తీసుకుందామన్న ఆలోచన చేస్తున్నారు. 

ఆచితూచి అడుగులు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, మదన్ లాల్ తో పాటు మరికొందరు నేతలు పార్టీ మారొచ్చనే ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది. టీఆర్ఎస్​ టికెట్ దక్కకపోతే వేరే పార్టీలోకి జంప్​ చేద్దామన్న ఆలోచనలో కొందరు ఉంటే, ఒకరిద్దరు లీడర్లు మాత్రం ఇప్పటికే పార్టీ మారాలని డిసైడైనా సరైన టైమ్ ​కోసం వెయిట్ చేస్తున్నారు. గత నెలలో జరిగిన కుమార్తె పెళ్లి తర్వాత పొంగులేటి పార్టీ మార్పు ప్రకటన ఉంటుందని అనుచరులు భావించినా, ఆయన మాత్రం ఆచితూచి నిర్ణయం అనే సంకేతాలు పంపిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్​ నుంచి ఢిల్లీ స్థాయిలో పొంగులేటిని లాగేందుకు ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుది కూడా ఇదే పరిస్థితి. సొంత నియోజకవర్గం కొల్లాపూర్​లో కాంగ్రెస్​ నుంచి గెలిచి వచ్చిన ఎమ్మెల్యేతో విభేదాలు, పార్టీ హైకమాండ్​పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి ఉన్నప్పటికీ బయటకు వెళ్లేందుకు తొందరపడడం లేదు. అదే జిల్లాలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే దయాకర్​రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్​ సీతా దయాకర్​ రెడ్డి దంపతులు టీడీపీ నుంచి బయటకు వచ్చారు. వీళ్లిదరూ బైపోల్​రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని కేడర్​ చెబుతున్నారు. 

చాలా జిల్లాల్లో అదే పరిస్థితి

ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు బాలూనాయక్​, వేముల వీరేశం కూడా పార్టీ మార్పుపై క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలాచోట్ల టీఆర్ఎస్​ నేతల మధ్య సమన్వయం లేదు. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలతో ఫైరవుతున్నారు. ప్రస్తుతం పదవుల్లో ఉన్న లీడర్లు కావడంతో ఇంకొద్ది కాలం ఆగుదామని ఆలోచిస్తున్నారు. గ్రేటర్​ కార్పొరేషన్​ పరిధిలో 10 నుంచి 15 మంది కార్పొరేటర్లు మునుగోడు బైపోల్ రిజల్ట్ తర్వాత పార్టీ మార్పు యోచనలో ఉన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీలున్న ఆదిలాబాద్​, నిజామాబాద్​, కరీంనగర్​ జిల్లాల్లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ జంపయ్యేందుకు తగిన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా జిల్లాల్లో ఆయా లీడర్లు ఆఫ్ ది రికార్డు మాట్లాడుతున్న సమయంలో మునుగోడు ఉప ఎన్నికల గురించి ఆరా తీస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందని డిస్కస్​ చేస్తున్నారు. దాన్ని బట్టి తమ ఫ్యూచర్​ డిసైడ్ అవుతుందని కూడా చెబుతున్నారు.