పాపం కుక్క..!..తుని చిన్నారి కోసం వెతుకుతూ నీరసించి మృతి.. ఏపీలో మిస్టరీగా మారిన రెండేండ్ల పాప మిస్సింగ్ కేసు..

పాపం కుక్క..!..తుని చిన్నారి కోసం వెతుకుతూ నీరసించి మృతి.. ఏపీలో  మిస్టరీగా మారిన రెండేండ్ల పాప మిస్సింగ్ కేసు..
  • తుని చిన్నారి ఆచూకీ కోసం వెతుకుతూ నీరసించి మృతి
  • 500 ఎకరాల అడవిలో జల్లెడ పడుతున్న 400 మంది పోలీసులు

ఏపీలోని కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌‌‌‌ అగ్రహారంలో మిస్సైన  రెండేండ్ల చిన్నారి  ఆచూకీ కనుగొనడంలో కీలక ఆధారంగా మారిన పెంపుడు కుక్క మృతి చెందింది. ఎనిమిది రోజుల కిందట పాపతో పాటే వెళ్లిన కుక్క.. ఇటీవల తిరిగి రావడంతో పాప ఆచూకీ తెలుస్తుందని పోలీసులు భావించారు. ఇప్పుడా కుక్క కూడా మృతి చెందడంతో పోలీసులు కీలక ఆధారం కోల్పోయారు.

అమరావతి: ఏపీలోని కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారంలో మిస్సైన  రెండేండ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) ఆచూకీ కనుగొనడంలో కీలకమైన ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందింది. ఎనిమిది రోజుల కిందట పాపతో పాటే వెళ్లిన కుక్క.. ఇటీవల తిరిగి రావడంతో పాప ఆచూకీ తెలుస్తుందని పోలీసులు భావించారు. అయితే..ఇప్పుడా కుక్క కూడా మృతి చెందడంతో దర్యాప్తునకు సంబంధించి పోలీసులు కీలక ఆధారం కోల్పోయారు.

గత శనివారం పాపతోపాటు పామాయిల్ తోటలోకి వెళ్లిన కుక్క.. నాలుగు రోజుల( మంగళవారం)కు ఒక్కటే ఇంటికి తిరిగి వచ్చింది. బుధవారం రాత్రి దీన్ని పట్టుకున్న పోలీసులు.. గురువారం దీని సాయంతో పోలీసు జాగిలాల ద్వారా గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి అడవిలోకి పంపగా.. అది కేవలం 80 నిమిషాల్లో 8 కిలోమీటర్ల మేర తిరిగి మళ్లీ ఇంటికే చేరింది. అయితే, ఇన్ని రోజులుగా ఆహారం లేకపోవడం, తీవ్ర అలసట కారణంగా అది ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. 

అసలేం జరిగిందంటే..?

సీహెచ్‌ అగ్రహారం గ్రామ శివారులోని 50 ఎకరాల పామాయిల్ తోటకు కాపలాదారులుగా ఉన్న సుంకర గణేశ్, భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి. గత శనివారం మధ్యాహ్నం తండ్రి చిన్నారిని ఇంటి వద్ద దింపి తిరిగి తోటలోకి వెళ్తుండగా.. ఆయన వెనకాలే పాప కూడా బయలుదేరింది. పాప వెంట వారి పెంపుడు కుక్క కూడా వెళ్లింది. తల్లి ఇంట్లో మరో బిడ్డ పనిలో ఉండటంతో పాప వెళ్లిన విషయాన్ని గమనించలేదు. అప్పటి నుంచి గత ఎనిమిది రోజులుగా పసిపాప ఆచూకీ లేకుండా పోయింది.

రంగంలోకి 400 మంది బలగాలు.. డ్రోన్లతో గాలింపు

ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. సుమారు 400 మందికి పైగా పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్, అటవీశాఖ బృందాలు 10 ప్రత్యేక టీమ్‌లుగా ఏర్పడి 500 ఎకరాల పరిధిలోని తోటలు, కొండ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. దట్టమైన పొదలు ఉండటంతో అత్యాధునిక డ్రోన్ కెమెరాలను కూడా రంగంలోకి దించారు. తుని, నర్సీపట్నం పరిసరాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల సీసీటీవీ  ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ఇంటి సమీపంలోని ఇనుప కంచె వద్ద చిన్నారి, కుక్క వెంట్రుకలు లభ్యం కావడంతో వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. తండ్రికి ఉన్న కారు లీజు వివాదాల కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

చిన్నారి అదృశ్యం ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాపను సురక్షితంగా వెలికితీసేందుకు మరిన్ని అదనపు బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య అధికారులతో సమీక్ష నిర్వహించి, బాధితులకు ధైర్యం చెప్పారు. కాగా..చిన్నారి ఇంట్లో ఆడుకుంటున్న పాత వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవున్నాయి.