- ఉదయం 7 గంటలకే విధులకు హాజరవ్వాలని ఆదేశాలు
- కొత్త ఉత్తర్వులపై ఉద్యోగులు అభ్యంతరం
- వెనక్కి తీసుకోవాలని డిమాండ్
- లేకుంటే ఆందోళనలకు దిగుతమని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు : గ్రామ పంచాయతీ సెక్రటరీలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. వాళ్లు ఉదయం 7 గంటలకే విధు లకు హాజరై అటెండెన్స్ ఇవ్వాలని పంచాయతీ రాజ్ కొత్త డైరెక్టర్ హనుమంతరావు ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను అన్ని జిల్లాల డీపీవోలు అమలు చేస్తున్నారు. కొత్త ఆదేశాలు తమకు ఇబ్బందికరంగా ఉన్నయని పంచాయతీ సెక్రటరీలు ఆవేదన చెందుతున్నారు. సెక్రటరీల సంఘం వినతి మేరకు నెల క్రితం వరకు పనిచేసిన పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్ అటెండెన్స్ లో సవరణలు చేశారు. ఉదయం 9,10 గంటల్లోపు అటెండెన్స్ ఇవ్వాలని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్త డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా విధులు చేస్తే పని ఒత్తిడికి గురవుతామని అంటున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో శానిటేషన్ పనులు సక్రమంగా జరగుతున్నా.. వర్షాలు పడుతున్నాయనే సాకుతో ఆర్డర్స్ మార్చారని పంచాయతీ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆర్డర్స్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పని ఒత్తిడితో సతమతమవుతుంటే అటెండెన్స్ పేరుతో వేధించటం కరెక్ట్ కాదని వాపోతున్నారు.
కొత్త ఆదేశాలు ఏంటంటే..
"ఊర్లలో శానిటేషన్ కార్యక్రమాలు చేయడానికి సెక్రటరీలు ఉదయం 7 గంటలకే అటెండ్ అవ్వాలి. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా.. ఇన్ టైమ్ లో హాజరుకాకపోయినా మెమో జారీ చేస్తాం. ఉదయం 6 గంటల నుంచే ఊర్లో శానిటేషన్ పనులు స్టార్ట్ కావాలి. అలా చేయకుంటే ఎందుకు చర్యలు తీసుకోవద్దో మెమో అందిన 24 గంటల్లో లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలి.” ఇవి పంచాయతీ రాజ్ డైరెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు డీపీవోలు పంచాయతీ సెక్రటరీలకు ఇచ్చిన ఉత్తర్వులు.
ఓ వైపు పొగడ్తలు..మరోవైపు వేధింపులు
రాష్ట్రంలో పంచాయతీ సెక్రటరీలు మంచిగా పనిచేస్తున్నారని సీఎం నుంచి మంత్రులు వరకు చాలా సార్లు పొగడారు. 4 దశలుగా జరిగిన పల్లె ప్రగతి.. సెక్రటరీల వల్లే సక్సెస్ అయిందని, ఊర్లలో సీజనల్ వ్యాధులు రాకుండా కృషి చేశా రని మంత్రి దయాకర్ రావు అన్నారు. కేంద్రం ప్రకటించిన 20 బెస్ట్ గ్రామాల్లో 19 మన రాష్ర్టానివే కావడం పట్ల గర్వపడుతున్నట్లు మంత్రి చెప్పారు. అయితే, ఇది నాణేనికి ఒక వైపు మాత్రమేనని..నిజానికి తమపై అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని సెక్రటరీలు వాపోతున్నారు. మూడేళ్లున్న ప్రొబెషన్ టైమ్ 4 ఏండ్లకు పెంచారని.. దాంతో చాలా మంది రిజైన్ చేశారని అంటున్నారు. పని ఒత్తిడి, వేధింపులతో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఇట్ల అయితే పని చేయలేమని.. ఇలాగే కొనసాగితే మరింత మంది ఉద్యోగాలు వదిలేయటం ఖాయమని పేర్కొన్నారు.
ఉదయం 7 గంటలకు అటెండెన్స్ కష్టం
వర్షాకాలంలో పబ్లిక్ ఇబ్బందులు పడకూడదని ఉదయం 7గంటలకే విధులకు హాజరవుతాము. శానిటేషన్ వర్స్క్ సక్రమంగా జరగుతున్నాయి. సెక్రటరీలు తమ అటెండెన్స్ ను యాప్‌లో అప్ డేట్ చేస్తున్నరు. అది ఇపుడు కొత్త కాదు. ప్రజలకు ఇబ్బందులు ఉంటే పనిచేసేందుకు రెడీగా ఉన్నాం. కానీ ప్రతిరోజుఉదయం 7 గంటలకే హాజరయ్యి అటెండెన్స్ ఇవ్వాలంటే ఇవ్వలేం.
- నిజామాబాద్‌కు చెందిన సీనియర్ సెక్రటరీ
ఆర్డర్స్ వెనక్కి తీసుకోవాలె
పంచాయతీ సెక్రటరీలకు ఉదయం 7 గంటలకు అటెండెన్స్ ఇవ్వాలని డీపీవోలు ఆర్డర్స్ ఇస్తున్నారు. గతంలో కమిషనర్ ఈ సర్క్యులర్ ఇస్తే యూనియన్ 4 సార్లు కలిసి, మీటింగ్‌లు పెట్టి రిక్వెస్ట్ చేస్తే సడలింపు ఇచ్చారు. ఉదయం 9, 10 గంటల్లోపు అటెండెన్స్ ఇవ్వొచ్చన్నారు. ఇప్పుడు కొత్త డైరెక్టర్ రాగానే మళ్లీ 7 గంటలకు అటెండెన్స్ ఇవ్వాలనటం సరికాదు. ఆఫీసర్లు మారినప్పుడల్లా రూల్స్ మారితే కష్టం. ఆర్డర్స్ వెనక్కి తీసుకోవాలి.
- మహేశ్, పంచాయతీ సెక్రటరీల సంఘం స్టేట్ ప్రెసిడెంట్
