నిలిచిపోయిన రైతు బంధు పంపిణీ 

నిలిచిపోయిన రైతు బంధు పంపిణీ 
  • ఇంకా 21.01 లక్షల మంది రైతులకు అందలే 
  • టెక్నికల్‌‌ ప్రాబ్లం అంటున్న అధికారులు
  • ఫండ్స్​ లేకనే ఆగిందన్న అనుమానాలు 

హైదరాబాద్‌‌, వెలుగు:  రైతుబంధు పథకం కింద నిధుల పంపిణీని మూడు రోజులకే నిధులు లేక నిలిపివేశారు. జూన్‌‌ 28 నుంచి రైతుబంధు నిధులను రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. మూడు రోజుల పాటు 47,09,219 మంది రైతుల ఖాతాల్లో రూ.3,133.21 కోట్లు జమ చేశారు. ఆ తర్వాత నిధుల పంపిణీ నిలిచిపోయింది. టెక్నికల్‌‌ ప్రాబ్లమ్‌‌ వల్లే మిగతా రైతులకు నిధులు జమచేయలేక పోయినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఆర్థికశాఖ వద్ద నిధులు లేనందుకే నిలిపివేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 68.10 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. సీసీఎల్‌‌ఏ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు రైతుబంధు సాయం అందించాలని నిర్ణయించారు.

ఈ వానాకాలం రైతుబంధు పంపిణీ చేసేందుకు మొత్తం రూ.7,521.80 కోట్ల నిధులు అవసరమని వ్యవసాయశాఖ లెక్కలు కట్టింది. అయితే, ఇప్పటివరకు 47.09 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. మరో 21.01లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సి ఉంది. వీరందరికీ కలిపి రూ.4,388.59 కోట్ల నిధులు అవసరం. కానీ ఫండ్స్ లేకపోవడంతో మూడు రోజులకే పంపిణీని తాత్కాలికంగా నిలిపేసినట్లు తెలిసింది. సోమవారం కొన్ని నిధులు సమకూరే అవకాశం ఉందని, ఆ నిధులు రాగానే మళ్లీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం ప్రారంభించనున్నట్లు సమాచారం.