తెలంగాణలో ప్రచారానికి తెర.. మైకులు బంద్

తెలంగాణలో ప్రచారానికి తెర.. మైకులు బంద్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడవు ముగిసింది. రాజకీయ నాయకుల ప్రచారానికి తెర పడింది. మంగళవారం (నవంబర్ 28వ తేదీ ) సాయంత్రం వరకు రాజకీయ నాయకులు  ప్రచారం చేసి ముగించారు. దాదాపు నెల రోజులకు పైగా బహిరంగసభలు, రోడ్ షోలు, ఆత్మీయ సమ్మేళనాలు, కార్నర్ మీటింగ్‌లు, పాదయాత్రలతో బిజీ బిజీగా గడిపిన నాయకులు... ప్రచారం ముగించారు.

జోరుగా ప్రచారం 

అధికార బీఆర్ఎస్ తరపున కేసీఆర్, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు, ఎమ్మెల్సీ కవిత విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్, బీజేపీ తరపున ఢిల్లీ నేతలు నియోజకవర్గాలను చుట్టేశారు.

నవంబర్ 30న తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. దీంతో ఆ 13 స్థానాల్లో మంగళవారం (నవంబర్ 28న) సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగిసింది. సిర్పూర్‌, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాలు ఈ జాబితాలో ఉన్నాయి. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు రాజకీయ నేతల ప్రచారం సాగింది. 

అమల్లోకి 144 సెక్షన్ 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాలను విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ప్రలోభాల కట్టడికి నిఘా మరింత పటిష్టం చేయనున్నారు. సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఇక పోలింగ్ ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. నవంబర్ 30న జరిగే పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ ఎన్నికల బరిలో 2 వేల 290 మంది అభ్యర్థులు ఉన్నారు. వారిలో 221మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 35 వేల 655 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. 

పోలింగ్ సందర్బంగా భద్రతా విధుల్లో 45 వేల మంది తెలంగాణ పోలీసులు ఉండనున్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందే రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. సమావేశాలు, ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దని ఈసీ సూచించింది. మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేది సాయంత్రం 5 గంటల వరకు సైలెంట్‌ పీరియడ్‌లో టీవీ, సోషల్‌ మీడియాలో ప్రకటనలకు అనుమతి లేదు. 

పత్రికల్లో వేసే ప్రకటనలకు మోడల్‌ కోడ్‌ మీడియా కమిటీ ముందస్తు అనుమతి ఉండాలి. వేరే నియోజకవర్గం నుంచి ప్రచారానికి వచ్చిన వాళ్లు స్థానికంగా ఉండకూడదని, లాడ్జ్‌లు, గెస్ట్‌ హౌస్‌లు, హోటల్‌లో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు సాయంత్రం 5 గంటల లోపు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 29, 30 తేదీల్లో రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, పత్రికా గోష్ఠులు నిర్వహించరాదని, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపకూడదని స్పష్టం చేసింది.