రాష్ట్రంలో ఓటర్లు 2.99 కోట్లు

రాష్ట్రంలో ఓటర్లు 2.99 కోట్లు

ఫైనల్ లిస్టు విడుదల చేసిన ఈసీ 
హైదరాబాద్ జిల్లా లో ఎక్కువ, ములుగులో తక్కువ 
నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లిలో ఎక్కువ, భద్రాచలంలో తక్కువ  
పోయినేడాదితో పోలిస్తే 3.63 లక్షలు తగ్గిన ఓటర్లు 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) గురువారం విడుదల చేసింది. మొత్తం 2,99,92,941 మంది ఓటర్లు ఉన్నారని తెలిపింది. వీరిలో మగవాళ్లు 1,50,48,250 మంది ఉండగా, ఆడవాళ్లు 1,49,24,718 మంది ఉన్నారని పేర్కొంది. కొత్తగా నమోదు చేసుకున్న యువ ఓటర్లు (18–19 ఏండ్ల వాళ్లు) 2,78,650 మంది ఉన్నారని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 34,891 పోలింగ్‌‌ కేంద్రాలు ఉన్నాయని వెల్లడించింది.  పోయినేడాది నవంబర్‌‌లో మొత్తం 2,95,65,669 మంది ఓటర్లతో ముసాయిదా జాబితాను ఈసీ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలను స్వీకరించింది. ఆ అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం 6,84,408 మంది ఓటర్లను కొత్తగా చేర్చగా.. 2,72,418 మంది ఓటర్లను తొలగించి తుది జాబితా విడుదల చేసింది. కాగా, పోయినేడాది జనవరిలో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో 3,03,56,894 మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఈసారి 3,63,953 మంది ఓటర్లు తగ్గారు. 

హైదరాబాద్ జిల్లాలో ఎక్కువ.. 

జిల్లాల వారీగా ఓటర్లను పరిశీలిస్తే హైదరాబాద్‌‌‌‌ లో ఎక్కువగా 42,15,456 మంది ఉన్నారు. ఆ తర్వాత రంగారెడ్డిలో 31,08,068 మంది, మేడ్చల్‌‌‌‌-మల్కాజిగిరిలో 25,24,951 మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా ములుగు జిల్లాలో 2,08,176 మంది ఓటర్లు ఉన్నారు. ఇక నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే శేరిలింగంపల్లిలో అత్యధికంగా 6,44,072 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్‌‌‌‌ నియోజకవర్గంలో 6,12,700 మంది, మేడ్చల్‌‌‌‌లో 5,53,785 మంది, ఎల్బీనగర్‌‌‌‌ లో 5,34,742 మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా భద్రాచలం నియోజకవర్గంలో 1,42,813 మంది ఓటర్లు ఉన్నారు. 

పారదర్శకంగా రూపొందించాం: సీఈవో 

ఓటర్ల జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందించామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్‌‌‌‌రాజ్‌‌‌‌ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి, అన్ని వర్గాల అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే తుది జాబితాను విడుదల చేశామని చెప్పారు. ఓటరు నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్‌‌‌‌లు నిర్వహించామని, రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. 361 గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి 2,800కు పైగా దరఖాస్తులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటు కోసం దరఖాస్తు చేసుకోనోళ్లు ఎన్‌‌‌‌వీఎస్‌‌‌‌పీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌, ఓటర్‌‌‌‌ హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌ యాప్‌‌‌‌ ద్వారా అప్లై చేసుకోవచ్చని 
సూచించారు.