
భారత రాజ్యాంగ అత్యున్నత పదవుల్లో రాష్ట్రపతి ప్రథముడైతే.. రెండో అత్యున్నత హోదా ఉప రాష్ట్రపతిది. కొద్దిరోజుల కిందట ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో కొత్త ఉప రాష్ట్రపతిగా మరొకరిని ఎన్నుకునేందుకు ఎన్నిక అనివార్యమైంది. ధన్‌ఖడ్ తీసుకున్న రాజీనామా నిర్ణయం రాజకీయాల్లో సంచలనంగా నిలిచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెండేండ్లకుపైగా పదవీకాలం ఉండగానే.. ధన్‌ఖడ్ మధ్యలోనే రాజీనామా చేసిన తొలి ఉప రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. అనారోగ్య కారణాలతోనే తప్పుకుంటున్నట్టు ధన్‌ఖడ్ వివరణ ఇచ్చుకున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వ వ్యవహార ధోరణితోనే ఆయన రాజీనామా చేశారని మరోవైపు విపక్షాలు ఆరోపించాయి. కొద్దిరోజుల కింద కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడులైంది. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటముల తరఫున అభ్యర్థులు బరిలో నిలిచారు. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుండగా ‘ఎలక్టోరల్ కాలేజీ’ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంట్ ఉభయసభలైన రాజ్యసభ, లోక్‌సభలోని సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. రాష్ట్రాల అసెంబ్లీల ఎమ్మెల్యేలు, మండళ్ల ఎమ్మెల్సీలకు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు లేదు.
ఎన్డీఏ కూటమి నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఈయన ఆర్ఎస్ఎస్ యాక్టివిటిస్ట్. బీజేపీ నుంచి రెండుసార్లు కోయంబత్తూరు ఎంపీగా గెలిచారు. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే.. జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులు అయ్యారు. ఆ తర్వాత మహారాష్ట్రకు బదిలీపై వెళ్లారు. అటునుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈయన తెలంగాణకు చెందినవారు. ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధాలు కలిగిలేరు. గోవాకు తొలి లోకాయుక్త చైర్మన్‌గా పనిచేశారు. న్యాయకోవిదులుగా, మానవ హక్కులవాదిగా పేరొందారు. ఉప రాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న తొలి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కూడా ఆయనే.
ఇద్దరూ దక్షిణాది వారే..
ఇద్దరు అభ్యర్థులు దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారు కావడం గమనార్హం. గతంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఉత్తర, దక్షిణ ప్రాంతాల అభ్యర్థులే పోటీ పడిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి దక్షిణాది నుంచి పోటీలో ఉండడం.. ఇలా స్వాతంత్ర్యానంతరం తొలిసారి కావడం విశేషం. ఇలాంటి పరిస్థితి గతంలో రాష్ట్రపతి ఎన్నికలోనూ జరిగింది. 2002లో తమిళనాడుకు చెందిన క్షిపణి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాంను ఆనాటి కేంద్ర ఎన్డీఏ సర్కార్ అభ్యర్థిగా నిలబెట్టింది. అదేవిధంగా విపక్ష వామపక్ష కూటమి.. ఫ్రీడమ్ ఫైటర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ శిష్యురాలు కెప్టెన్ లక్ష్మీ సెహెగల్ను పోటీలో నిలిపింది. వీరిద్దరూ తమిళనాడుకు చెందినవారు. ఇలా ఒకే రాష్ట్రం నుంచి రాష్ట్రపతి అభ్యర్థులుగా పోటీ చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి కూడా. అలాగే దక్షిణాది నుంచి ఎక్కువమంది రాష్ట్రపతులు అయ్యారు.
ఉప రాష్ట్రపతిని ‘వేల్స్ యువరాజు’గా పోల్చిన అంబేద్కర్
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారత రాజ్యాంగంలో ఉప రాష్ట్రపతికి ఉదాత్తమైన, ప్రతిష్టాత్మకమైన గుర్తింపు ఉంది. రాజ్యసభ చైర్మన్‌గా సభను నడుపుతారు. రాష్ట్రపతి విధుల్లో లేనప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక రాష్ట్రపతి అధికారాలతో పోల్చితే.. ఉప రాష్ట్రపతికి కొంత తక్కువ ప్రాధాన్యతే ఉంది. ఉప రాష్ట్రపతికి ఎలాంటి స్వతంత్ర కార్యనిర్వాహక అధికారాలు లేవు. అందుకే.. ఆ పదవిని కొందరు రాజకీయవేత్తలు ‘ఉత్సవ పదవి’గా అభివర్ణించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ అయితే.. ఉప రాష్ట్రపతిని ‘వేల్స్ యువరాజు’తో పోల్చారు. రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా అంబేద్కర్ అలా వ్యాఖ్యానించారు. బ్రిటన్ రాజుకు వేల్స్ యువరాజు డిప్యూటీగా వ్యవహరిస్తారు. మనదేశంలోనూ రాష్ట్రపతికి ఉప రాష్ట్రపతి డిప్యూటీగా వ్యవహరిస్తారని అంబేద్కర్ పేర్కొన్నారు. ఇలాంటి పదవి భారత్‌లో తప్ప, ప్రపంచంలోని మరే పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాల్లో లేదు. అయితే.. అమెరికా ఉపాధ్యక్ష పదవితో కొంత
సారూప్యత ఉన్నా.. , విధుల్లో తేడాలు ఉన్నాయి.
ప్రతివ్యూహాలు
తమ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకేనని ఎన్డీఏ కూటమి ధీమాతో ఉంది. మరోవైపు తమ అభ్యర్థికి ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తే గెలుస్తారని ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రచారం చేసుకుంటోంది. మొదట్లో ఉపరాష్ట్రపతి పదవిని ఏకగ్రీవం చేయాలని ఎన్డీఏ కూటమి భావించింది. కానీ, ఆ ఆశలపై ఇండియా కూటమి నీళ్లు చల్లింది. పార్లమెంటులో అధిక మెజార్టీ సభ్యులు కలిగిన బీజేపీ ఈజీగా గెలిచే అవకాశాలున్నా కానీ.. విపక్ష కూటమి అభ్యర్థిని నిలపడం ద్వారా ఎన్నికను రసవత్తరంగా మార్చిందని చెప్పొచ్చు.
ఇరు కూటముల ఆరోపణలు, విమర్శలు
ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న సమయంలో చత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుం కేసులో ఇచ్చిన తీర్పు నక్సలిజాన్ని ప్రోత్సహించిందని సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు.. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం కలిగిన నేతను గెలిపిస్తే దేశంలో లౌకికవాదం దెబ్బతింటుందని ఇండియా కూటమి విమర్శిస్తోంది. రాజకీయేతర వ్యక్తిని బరిలో నిలిపామని, ఇది సైద్ధాంతికమైన పోరుగా చెప్పుకుంటోంది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యానే సీపీ రాధాకృష్ణన్ ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు పార్లమెంటులో ఎన్డీఏ కూటమికి ఉన్న మెజార్టీ రీత్యా సులభతరమే. సీపీ రాధాకృష్ణన్ ఎన్నికైతే, తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకట్రామన్ తర్వాత మూడో వ్యక్తి అవుతారు. ఎన్డీఏలోని కొందరు సభ్యులు రెబల్స్‌గా మారితే మాత్రం విపక్ష కూటమి అభ్యర్థికి ఫలితం భిన్నంగా రావచ్చు. ఏ కూటమి అభ్యర్థి ఉపరాష్ట్రపతి అవుతారో తెలుసుకునేందుకు కొద్దిరోజులు వేచిచూడాల్సిందే.
ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తారా?
దేశంలో రాజ్యాంగ పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చినప్పుడు సహజంగానే ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. ఆయా పదవులు రాజకీయాలతో సంబంధం లేకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించేవి కావడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ పార్టీలకతీతంగా ఓటర్లు ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆత్మప్రబోధానుసారం ఓటు వేయడం అంటే, ఓటరు నీతి, నిజాయితీతో స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా ఓటు వేయడం. ఇక ఉపరాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైనదని, ఎలక్టోరల్ ఓటర్లు ఆత్మప్రబోధానుసారం ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇండియా కూటమి నేతలు కోరుతున్నారు. గతంలో ఇందిరాగాంధీ హయాంలో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థించారు. కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి నీలం సంజీవ రెడ్డి కంటే స్వతంత్ర అభ్యర్థి వి.వి. గిరికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. అప్పట్లో స్వతంత్ర అభ్యర్థి వి.వి. గిరి రాష్ట్రపతిగా ఎన్నికై చరిత్ర సృష్టించి ప్రథముడిగా నిలిచారు. మళ్లీ ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటుహక్కు వినియోగించుకోవాలనే మాట ప్రాధాన్యతను సంతరించుకుంది.
- వేల్పుల సురేష్,
సీనియర్ జర్నలిస్ట్