ప్రజాపాలన దరఖాస్తులకు ఇవ్వాలే లాస్ట్ డేట్

ప్రజాపాలన దరఖాస్తులకు ఇవ్వాలే లాస్ట్ డేట్
  • మహాలక్ష్మి పథకానికే ఎక్కువ మంది అప్లై
  • గ్రామ సభల్లో ఇవ్వనివారు మండల, మున్సిపల్‌ కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు
  • ప్రతి నాలుగు నెలలకోసారి అప్లికేషన్ల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన’ కార్యక్రమం శనివారం ముగియనుంది. గత నెల 28వ తేదీన మొదలైన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మొదటి రోజు నుంచే మంచి స్పందనతో ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన గ్రామసభల్లో 18,29,274 అభయహస్తం దరఖాస్తులు అందాయి.

వీటితో ఇప్పటి దాకా మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,08,94,115కు చేరింది. ఏడు రోజుల్లో అభయ హస్తం ఆరు గ్యారెంటీలకు  సంబంధించి 93,38,111 దరఖాస్తులు రాగా.. ఇతర అంశాలకు సంబంధించి 15, 55,704 అప్లికేషన్లు వచ్చాయి. శుక్రవారం దాకా 12,171 జీపీలు, 3,512 ము న్సిపల్ వార్డుల్లో ప్రజా పాలన నిర్వహించారు. చివరి రోజు మరిన్ని అప్లికేషన్లు వచ్చే చాన్స్​ ఉంది. డిసెంబర్​31, జనవరి ఒకటో తేదీ మినహా 7 రోజులు.. రోజుకు రెండు గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తూ వచ్చారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేస్తున్నారు. ప్రతీ 4నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన నిర్వహించనున్నది. గ్రామ సభల్లో అప్లికేషన్లు ఇవ్వలేని వారు తహసీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్​ కార్యాలయాల్లో కూడా ఇవ్వొచ్చని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. డేటా ఎంట్రీని ఈ నెల 17 వరకు పూర్తి చేయాలని ఇప్పటికే సీఎస్ శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు.