నేషనల్ హెరాల్డ్ కార్యాలయంపై ఈడీ దాడులు

నేషనల్ హెరాల్డ్ కార్యాలయంపై ఈడీ దాడులు

మనీలాండరింగ్ కేసులో భాగంగా నేషనల్ హెరాల్డ్ కార్యాలయంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేపట్టింది. ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ సంస్థ కేంద్ర కార్యాలయంతో సహా 12 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల అనంతరం ఆస్తులను అటాచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆ విచారణ జరిగిన కొద్దిరోజుల తర్వాత ఈ దాడులు జరుగుతున్నాయి. 

ఇటీవల మూడు రోజులు 12 గంటల పాటు ఈడీ అధికారులు సోనియాగాంధీని ప్రశ్నించారు. అంతకుముందు రాహుల్ గాంధీని కూడా ప్రశ్నించారు. రాహుల్, సోనియాగాంధీతో పాటు నేషనల్‌ హెరాల్డ్‌ సంస్థలో ఈడీ సోదాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలపై సమాధానాలు చెప్పలేక కేంద్రప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. 

బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా భారతీయుల వాణిని వినిపించేందుకు 1938లో అప్పటి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జవహర్‌లాల్‌ నెహ్రూ ‘నేషనల్‌ హెరాల్డ్‌’ పత్రికను ప్రారంభించారు. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌) సంస్థ ఆధ్వర్యంలో పత్రిక నిర్వహణ కొనసాగింది. ప్రస్తుతం యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో 2016లో ఈ వార్తా సంస్థ సేవలు పునఃప్రారంభమయ్యాయి.