
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రాహుల్ గాంధీపై ఈడీ చేపట్టిన విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 40 గంటలపాటు విచారణ చేపట్టిన ఈడీ అధికారులు... రాహుల్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఇవాళ ఐదో రోజు ఈడీ అధికారులు రాహుల్ ప్రశ్నించనున్నారు. సోనియా గాంధీకి కరోనా సోకడంతో... ఆమెను చూసేందుకు ఆదివారం రాహుల్ ఈడీ అధికారుల నుంచి ఒక రోజు అనుమతి తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న సోనియా... నిన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పలు విషయాలపై ఈడీ అధికారులు రాహుల్ ను ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఏజేఎల్‌లో సోనియా, రాహుల్ వాటా ఎంత? సంస్థలో ఇంకా ఎవరెవరికి షేర్లు ఉన్నాయి? ఏజేఎల్ సంస్థకు కాంగ్రెస్ ఇచ్చిన నిధులెంత? అప్పులు, ఆస్తుల వివరాలేంటి? వంటి అంశాలపై రాహుల్‌పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అంతకుముందు సోమవారం దాదాపు పది గంటల పాటు రాహుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు ఇదే కేసులో జూన్ 23 వరకు ఈడీ ముందు విచారణకు హాజరుకావాలని సోనియాగాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది.