
పిల్లలు చూస్తుండగానే తండ్రి కాలువలో కొట్టుకుపోయిన ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో జరిగింది. మేడేపల్లి గ్రామానికి చెందిన కొల్లు సురేశ్ కుమార్(41), సునీత భార్యభర్తలు. ముదిగొండలో మెడికల్షాప్రన్ చేస్తున్నారు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. రోజూ మాదిరిగానే సురేశ్ ఆదివారం ఉదయం తన కొడుకు(10), అన్న కొడుకు(11)లతో కలిసి వాకింగ్‌కి వెళ్లాడు. అనంతరం మంగాపురం మేజర్ కాలువ ఒడ్డున ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టి ఈత కొట్టేందుకు నీటిలో దిగాడు. ఈదుకుంటూ కాలువ అవతలి వైపు వెళ్లాడు. ఇంతలో చిన్నారులు నీటిలోకి దిగుతుండడంతో ఆందోళనతో వారివైపు రాబోయాడు. నీటి ప్రవాహానికి కొట్టుపోయాడు. గమనించిన స్థానికుడు సామినేని ప్రవీణ్ కుమార్ గట్టిగా కేకలు వేశాడు. గ్రామస్తులు వచ్చి గాలించగా ఘటనా స్థలానికి 100 మీటర్ల దూరంలో చెట్టుకు చిక్కుకుని సురేశ్శవం కనిపించింది. తాళ్ల సహాయంతో బయటికి తీశారు. సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముదిగొండ ఎస్సై నరేశ్ కేసు ఫైల్‌చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఖమ్మం గవర్నమెంట్‌హాస్పిటల్‌కి తరలించారు.