తొలి 3డీ ప్రింటెడ్ రాకెట్.. సగం దాకా ఎగిరి కిందకొచ్చింది  

తొలి 3డీ ప్రింటెడ్ రాకెట్.. సగం దాకా ఎగిరి కిందకొచ్చింది  

కేప్ కానవెరాల్: ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ రాకెట్ ‘టెర్రన్-1’ కక్ష్యకు చేరడంలో ఫెయిల్ అయింది. బుధవారం రాత్రి అమెరికా ఫ్లోరిడాలోని కేప్ కేనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి రాకెట్ ను ప్రయోగించగా, సగం దాకా ఎగిరి.. కిందకు పడిపోయింది. టెర్రన్ 1 ను అమెరికాకు చెందిన రిలేటివిటీ స్పేస్ అనే కంపెనీ రూపొందించింది. ఇందులో ఇంజన్లు సహా దాదాపు 85 శాతం పార్ట్స్ 3డీ ప్రింటర్ ల ద్వారానే తయారయ్యాయి. 33 మీటర్ల పొడవైన ఈ రాకెట్ 200 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యకు చేరాల్సి ఉండగా, ఫస్ట్ స్టేజ్ అనుకున్న విధంగానే పూర్తయింది. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ ఇంజన్ కూడా స్టార్ట్ అయినా.. వెంటనే అది ఆగిపోయింది. దీంతో రాకెట్ కిందకు వచ్చి అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయింది. అనుకున్న ప్లాన్ ప్రకారం.. ఈ రాకెట్ లోని సెకండ్ స్టేజ్ 200 కి.మీ. ఎత్తులోని కక్ష్యలోకి చేరి, అక్కడే కొన్ని రోజుల పాటు తిరగాల్సి ఉంది. ఆ తర్వాత తిరిగి వాతావరణంలోకి వచ్చి మండిపోవాల్సి ఉంది. ప్రయోగాత్మకంగా తయారు చేసిన ఈ రాకెట్ లో శాటిలైట్లు, ఇతర పేలోడ్ల వంటివి ఏమీ లేవని ఆ కంపెనీ వెల్లడించింది. ఇది ఫెయిల్ అయినప్పటికీ తమకు ఫస్ట్ ప్రయోగం కాబట్టి ఎక్సైటింగ్ గా అనిపించిందని తెలిపింది. భవిష్యత్తులో పెద్ద సైజులోని రాకెట్లను సైతం 3డీ ప్రింటర్లతో తయారు చేసి, మళ్లీ మళ్లీ వాడుకునేందుకు వీలుగా తయారు చేయాలన్నది తమ లక్ష్యమని పేర్కొంది.