- 11న ఎన్నికలు.. అదేరోజు ఫలితాలు
- అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
- సైలెంట్ ఆపరేషన్ షురూ చేసిన అభ్యర్థులు
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రచారం ముగిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోగా.. అభ్యర్థులు సైలెంట్ ఆపరేషన్ షురూ చేశారు. ఇన్నాళ్లు మైకులు, డప్పులతో హోరెత్తించిన క్యాండిడేట్లు.. ఇప్పుడు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. పోలింగ్‌కు ఇంకా కొన్ని గంటలే సమయం ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు వార్డులు, కాలనీలవారీగా బాధ్యులను నియమించి.. డబ్బులు పంపిణీ ముమ్మరం చేశారు. పల్లెల్లో రాత్రివేళ మందు, విందు రాజకీయాలు జోరందుకున్నాయి. ‘మా ఓటు మీకే.. కానీ మాకేంటి..?’ అని అడిగే ఓటర్లకు ఎక్కడికక్కడ సెటిల్ చేస్తున్నారు. ప్రత్యర్థులు ఎంత ఇస్తే.. అంతకు మించి పంపిణీ చేస్తున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తున్నా.. కళ్లుగప్పి గుట్టుచప్పుకాకుండా పంపిణీ సాగిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామస్తులకు ఫోన్లు చేసి, వచ్చి ఓటేసి పోవాలని బతిమిలాడుతున్నారు.
బస్సు చార్జీలతోపాటు ఓటుకు ఇంత చొప్పున యూపీఐ ద్వారా పంపిస్తున్నారు. కొన్నిచోట్ల వలస ఓటర్లను తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా వెహికల్స్‌ను పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, మొదటి విడత ఎన్నికలు 11న జరగనున్నాయి. అదేరోజు విజేతలను ప్రకటించనున్నారు. మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు గాను 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 395 చోట్ల సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 3,836 సర్పంచ్ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే, 27,960 వార్డు స్థానాలకు ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క సర్పంచ్‌స్థానానికి సగటున ఆరుగురు బరిలో నిలిచారు. సర్పంచ్అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అందజేయనున్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర ఎన్నికల సామాగ్రితో సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం వరకు తరలివెళ్లనున్నారు. గురువారం ఉదయమే సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.
థర్డ్ ఫేజ్.. గుర్తులు ఫిక్స్
మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అభ్యర్థులెవరో తేలిపోయింది. బరిలో నిలిచేది ఎవరో క్లారిటీ వచ్చింది. గుర్తులు చేతికి రావడంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తుతున్నది. అభ్యర్థులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. కాగా, రెబల్స్‌ను బుజ్జగించడంలో కొన్ని చోట్ల సక్సెస్ అయిన పార్టీల నేతలు.. మరికొన్ని చోట్ల చేతులెత్తేశారు.
రూల్స్ బ్రేక్ చేస్తే రెండేండ్ల జైలు
తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో ప్రచార సమయం మంగళవారం సాయంత్రం 5 గంటలకే ముగిసిందని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం చేస్తే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమించినవారికి రెండేండ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశముందని ఎస్ఈసీ కార్యదర్శి మంద మకరందు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్లు, ఎన్నికల అధికారులు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. పబ్లిక్ మీటింగ్‌లు, మైక్ సెట్ల ద్వారానే కాకుండా.. ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ప్రచారం చేయడానికి వీల్లేదన్నారు. టీవీ ఛానెల్స్, రేడియోలు, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లోనూ రాజకీయ ప్రకటనలు, ప్రచారాలు బంద్ చేయాలని సూచించారు. మ్యూజికల్ ఈవెంట్లు, ఇతర వినోద కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

