యుద్ధం మొదలైనంక బయల్దేరిన తొలి ఓడ

యుద్ధం మొదలైనంక బయల్దేరిన తొలి ఓడ

కీవ్ : యూఎన్, టర్కీ మధ్యవర్తిత్వంలో జరిగిన ఒప్పందం ప్రకారం.. ఉక్రెయిన్​కు చెందిన ఓడ సోమవారం ఒడెసా పోర్ట్​ నుంచి బయలుదేరింది. రష్యాతో యుద్ధం మొదలైనంక ఉక్రెయిన్​ నుంచి బయల్దేరిన తొలి కార్గో షిప్​ ఇదే. సియెర్రా లియోన్ జెండాతో కార్గో షిప్ రజోనీ.. ఒడెసా నుండి 26,000 టన్నుల మొక్కజొన్నతో లెబనాన్‌‌కు బయలుదేరింది. రష్యా దాడి మొదలైన తర్వాత ఇన్నిరోజులకు దేశం నుంచి ఓ కార్గో షిప్​ బయటికి వెళ్లిందని ఉక్రెయిన్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ మినిస్టర్​ ఒలెక్సాండర్  కుబ్రకోవ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్​ చేశారు. మొక్కజొన్న ఎగుమతి చేసే నాలుగవ అతిపెద్ద దేశం ఉక్రెయిన్​ అని వివరించారు. పోర్టు ద్వారా ఎగుమతి చేసిన మొక్కజొన్నతో.. ప్రపంచంలో నెలకొన్న ఆహారం సంక్షోభ తీవ్రత కొంత తగ్గే చాన్స్​ ఉందన్నారు.

ఉక్రెయిన్​ తన పార్టనర్స్​తో కలిసి ప్రపంచం ఆకలిని తగ్గించేందుకు ముందడుగు వేసిందని తెలిపారు. ఉక్రెయిన్​ నుంచి షిప్​ బయలుదేరడం చాలా పాజిటివ్​ అని మాస్కోలోని క్రెమ్లిన్​ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్​ అన్నారు. రజోనీ.. మంగళవారం మధ్యాహ్నం కల్లా ఇస్తాంబుల్​లోని బోస్పోరస్​ వద్దకు చేరుకుంటుందని టర్కీ డిఫెన్స్​ మినిస్టర్​ హులుసీ అకర్​ తెలిపారు. లెబనాన్ ఎక్కువగా ఉక్రెయిన్ నుండి గోధుమలను దిగుమతి చేసుకుంటుంది. మొక్కజొన్నను వంట నూనె, గడ్డి తయారీకి కొనుగోలు చేస్తుంది.