
ఆది శంకరాచార్య.. మొదటి వేదపండితుడు, తత్త్వవేత్త, గురువు. ఈయన భారతదేశం గర్వించదగ్గ మహాత్ముల్లో ఒకరు. ఈ భూమ్మీద ఆయన జీవించినది కొద్దికాలమే అయినా వేదంత సారాన్ని దేశం నలుమూలలా బోధించాడు. శతృత్వాలు, వివాదాలు అన్నింటినీ అణచివేశాడు. నాలుగు పీఠాలను నలుదిక్కులా స్థాపించి ప్రాచీన వేదాంత విశ్వాసాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. అది ఎల్లప్పుడూ సజీవంగా ఉండడానికి కృషిచేశాడు. శంకరాచార్యులు బౌద్ధమత తత్త్వాన్ని తప్పుపడుతున్నట్టు అనిపించినా బుద్ధుని గురించి తక్కువ చేసి మాట్లాడడం ఎక్కడా చూడం. అంతేకాదు నిజానికి ఆయన బుద్ధుణ్ని ‘యోగీనాం చక్రవర్తి’ అని గౌరవప్రదంగా పిలిచేవాడు. సనాతన హిందూ మతంలోని ఆరు తెగలవారు ఒకరితో ఒకరు శతృత్వంతో ఉన్నప్పుడు కూడా ఆయన ‘సమన్వయ’ పద్ధతినే పాటించాడు. అంటే స్నేహభావం, సంయోగం, ఐకమత్యం కలిగి ఉండాలనేది ఆయన ఆకాంక్ష.
అందుకే ఆయనను ఈనాటికీ ‘షణ్మత స్థాపనాచార్య’గా గుర్తుంచుకుంటారు. ఆ కాలం నాటి ఆరు తెగల మధ్య వైరాన్ని పారదోలి స్నేహాన్ని నెలకొల్పినందుకు ఈ గుర్తింపు దక్కింది. తూర్పున ఆయన ఒకే ఒక తత్త్వవేత్త. ఆధునిక పాశ్చాత్య ప్రపంచానికి చెందిన తత్త్వవేత్తలు అయిన బెర్క్లీ, కెంట్, హెగెల్, ఫిక్టె, థామస్ హిల్ గ్రీన్, ప్రొఫెసర్ మెకంజీ వంటివారు, ఐడియలిస్టిక్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ వారు, గణిత శాస్త్రజ్ఞులు, డాక్టర్లు ఆయన్ను తాత్విక, శాస్త్రీయ సంబంధం కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. శ్రీ శంకరాచార్య ‘మానవ జీవిత లక్ష్యము’, ‘ఆత్మ స్వభావం’ గురించి విశదీకరించాడు. మనలో ఎప్పుడో ఒకసారి ‘నేను ఎవరిని? నా లక్ష్యం ఏంటి? ఎలా వచ్చాను? ఎటు వెళ్తున్నాను? ఎక్కడ ఉన్నాను? ఎక్కడికి వెళ్లాలి? వెళ్లడానికి సరైన మార్గం ఏది? వంటి ఎన్నో ప్రశ్నలు మనసులో మొదలవుతాయి. వాటిని పరిష్కరించుకోవాలి అనుకునేవాళ్లకు జగద్గురు శంకరాచార్య తన బోధనలతో మార్గం చూపించేవాడు. మనల్ని వెనక్కిలాగుతున్న కారణాలను అర్థం చేసుకుని సరైన విధానాలను అనుసరిస్తే అవి మనల్ని మన అడ్డంకుల్ని తొలగించుకునేలా చేస్తాయి. ఆ అడ్డంకులు లేదా అలాంటి విషయాలు మన నుంచి మన నిజమైన స్వభావాన్ని దాచి ఉంచుతాయి. వాటిని వదిలిపెట్టడం వల్ల మన దైవత్వం దినదినము, క్షణక్షణము నిత్యజీవితంలో స్వచ్ఛమైన, శాశ్వతమైన ఆనందాలను సంపూర్ణం చేస్తాయి అని బోధించాడు.
- మేకల
మదన్మోహన్ రావు
కవి, రచయిత