కృష్ణా నదిలో తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన వరద

కృష్ణా నదిలో తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన వరద

ఆల్మట్టి నుండి తగ్గినా.. నారాయణపూర్ నుండి పెరిగిన వరద

లోకల్ భారీ వర్షాలు జతకలవడంతో నారాయణ పూర్ కు వరద పోటు

జూరాలకు వరద పోటెత్తడంతో.. 26 గేట్లు ఎత్తివేత

రెండోసారి తెరచుకున్న శ్రీశైలం.. నార్జునసాగర్ గేట్లు

కృష్ణా నదికి ఆదుకుంటున్న వర్షాలు

ఆల్మట్టి  వద్ద స్టడీగా ఉన్న ట్రెండ్..

కృష్ణా నదిలో వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగింది. ఓ వైపు ఆల్మట్టి.. మరో వైపు తుంగభద్ర డ్యాం ల నుండి వరద తగ్గుముఖం పట్టడంతో.. శ్రీశైలం.. నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు వెంట వెంటనే మూతపడిన విషయం తెలిసిందే. అయితే ఊహించనిరీతిలో నారాయణపూర్ నుండి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ గేట్లు 24 గంటల్లో మళ్లీ తెరచుకున్నాయి. భారీగా వరద పోటెత్తడంతో గద్వాల సమీపంలోని ప్రియదర్శిని జూరాల డ్యామ్ వద్ద 10 గేట్ల ద్వారా కొనసాగిన నీటి విడుదలను మళ్లీ 26 గేట్లకు పెంచారు. జూరాలకు వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి జూరాల నుండి 1 లక్ష 80 వేలు.. తుంగభద్ర వైపు నుండి మరో 16 వేల క్యూసెక్కులు కలిపి 1 లక్ష 96 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. లోకల్ క్యాచ్ మెంట్ ఏరియా నుండి మరో  63 వేల క్యూసెక్కులు తోడవుతోంది. వర్షాలు మళ్లీ కురుస్తుండడంతో.. ఆల్మట్టి.. నారాయణపూర్.. నుండి నీటి విడుదల స్టడీగా కొనసాగుతుండగా.. తుంగభద్ర వైపు నుండి కొద్దిగా తగ్గుతోంది. మరో రెండు మూడు రోజులు వరదకు ఢోకా లేదని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.

గతేడాదిలానే కృష్ణా నది ఉగ్రరూపం

గతేడాదిలానే ఈసారి కూడా ఆగస్టులో భారీ వర్షాలు.. వరదలకు కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. శ్రీశైలం డ్యామ్ నాగార్జునసాగర్ డ్యామ్ లు ఓవర్ ఫ్లో కావడం ఈ సీజన్ లో రెండోసారి. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురుస్తుండగా.. ఆల్మట్టి.. నారాయణపూర్ క్యాచ్ మెంట్ ఏరియాల్లో మాత్రం సాధారణ వర్షాలు నమోదువుతున్నాయి. దీంతో మరో రెండు, మూడు రోజులు కృష్ణా నదిలో వరద ప్రవాహానికి ఢోకా ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే స్థాయిలో కాకున్నా.. కాస్త తగ్గినా.. వరద కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

ఆల్మట్టి, నారాయణపూర్ ల వద్ద స్టడీగా ఉన్న ట్రెండ్ .. తుంగభద్ర నదిలో కాస్త డౌన్ ఫాల్

మహారాష్ట్ర, కర్నాటకలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురుస్తుండడంతో.. ఆల్మట్టి.. నారాయణపూర్ ల నుండి కృష్ణా నది వరద ట్రెండ్ స్టడీగా కొనసాగుతోంది. మరో వైపు తుంగభద్ర డ్యామ్ తోపాటు.. నదిలోనూ ట్రెండ్ తగ్గుముఖం పడుతున్నా.. మరో రెండు రోజుల వరకు కృష్ణమ్మ పరవళ్లకు ఢోకా ఉండదని ఇరిగేషన్ నిపుణులు.. అధికారులు అంచనా వేస్తున్నారు. కర్నాటక, మహారాష్ట్రలోని కృష్ణా.. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ఇవాళ కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా నదిలో వరద ప్రవాహానికి ఢోకా లేకుండా పోయింది. పడిన వర్షపాతం ఆధారంగా.. కాస్త తగ్గుముఖం పట్టే అవకాశమే కనిపిస్తోందంటున్నారు అధికారులు.

శ్రీశైలం డ్యామ్ వద్ద 8గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

శ్రీశైలం డ్యామ్ వద్ద 8 గేట్ల ద్వారా నీటి విడుదల  కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2 లక్షల 58 వేల క్యూసెక్కులకు  పైబడి వస్తోంది. జూరాల.. తుంగభద్ర ల నుండి ఒక్కసారిగా 1 లక్ష క్యూసెక్కులకు పడిపోయిన వరద కాస్తా.. 24 గంటల్లో మళ్లీ లక్షన్నర నుండి 1 లక్ష 80 వేలకు పెరిగింది. దీంతో సీజన్లో రెండోసారి శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరచుకున్నాయి. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2 లక్షల 58 వేల క్యూసెక్కులు  ఉండగా.. ఏపీ పరిధిలోని కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31వేల క్యూసెక్కులు దిగువన నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. అలాగే పోతిరెడ్డిపాడు ద్వారా మరో 35 వేలు.. హంద్రీనీవాకు 1688 క్యూసెక్కులు.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు చొప్పున మొత్తం 2 లక్షల 92 వేల క్యూసెక్కులు శ్రీశైలం నుండి విడుదల చేస్తున్నారు.

జూరాల డ్యామ్ వద్ద 26 గేట్ల ద్వారా నీటి విడుదల

ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ నుండి వరద పోటెత్తుతుండడంతో జూరాల డ్యామ్ వద్ద 26 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం 2 లక్షల 15 వేల క్యూసెక్కులు వస్తుండగా.. దిగువన శ్రీశైలానికి 26 గేట్ల ద్వారా 1 లక్ష 51 వేల వేల క్యూసెక్కులు.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 29 వేల 601 క్యూసెక్కులు.. కలిపి మొత్తం 1 లక్ష 81 వేల క్యూసెక్కులు దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి నుండి వరద ట్రెండ్ స్టడీగా ఉన్నా.. నారాయణపూర్ నుండి కొనసాగుతుండడంతో రేపు వరద ప్రవాహాన్ని బట్టి గేట్లు పెంచడం లేదా.. దించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద 10 గేట్ల ద్వారా విడుదల

ఎగువ నుండి వస్తున్న వరద ప్రవాహానికి అనుగుణంగా నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద 10 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన కర్నాటక.. మహారాష్ట్రల నుండి వస్తున్న భారీ వరద వల్ల జూరాల.. శ్రీశైలం డ్యామ్ లు ఓవర్ ఫ్లో అవుతుండడంతో.. నాగార్జునసాగర్ వద్ద కూడా అదే పరిస్థితి ఏర్పడింది. మూతపడిన సాగర్ గేట్లు  వెంటనే ఎత్తడం ఈ సీజన్లో రెండోసారి. ప్రస్తుతం నాగార్జునసాగర్ కు 2 లక్షల 20 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. నిల్వ చేసే అవకాశం లేక వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులతో.. 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 589 అడుగులతో.. 309.934 టీఎంసీలు ఉంది.